సున్నం రాజయ్య రాజకీయ ప్రస్థానం ఇలా..

5 Aug, 2020 10:51 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే రాజయ్య(ఫైల్‌)

కరోనా కాటుకు బలైన మాజీ ఎమ్మెల్యే రాజయ్య

ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గిరిజన బిడ్డ

మూడుసార్లు ఎమ్మెల్యేగా భద్రాద్రి నియోజకవర్గానికి సేవలు

నిరాడంబర జీవితం గడిపిన నేత 

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య(62) సోమవారం రాత్రి మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యను కుటుంబసభ్యులు భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో అనుమానం వచ్చిన వైద్యులు సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ రావడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించాలని సూచించారు. ఆ రాత్రే అంబులెన్స్‌లో విజయవాడ తీసుకెళ్లారు. ఆస్పత్రికి వెళ్లగానే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. రాజయ్య మృతిని నియోజకవర్గ ప్రజలు, ఈ ప్రాంత గిరిజనులు తట్టుకోలేకపోతున్నారు. 

రాజకీయ ప్రస్థానం ఇలా.. 
గ్రామ సర్పంచ్‌గా మొదలైన రాజయ్య ప్రస్థానంఎమ్మెల్యే వరకు కొనసాగినా.. ఎప్పుడూ నిరాడంబర జీవితం గడిపారు. అనుక్షణం ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసమే పరితపించేవారు. ఏపీలో విలీనమైన వీఆర్‌ పురం మండలం చిన్నమట్టపల్లి పంచాయతీ శివారులోని సున్నంవారిగూడెంలో 1958 ఆగస్టు 8న సున్నం రాజులు, కన్నమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య చుక్కమ్మ, నలుగురు పిల్లలు ఉన్నారు. పదో తరగతి వరకు చదువుకున్న రాజయ్య 1988లో చిన్నమట్టపల్లి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అదే సమయంలో ఆ గ్రామ సీపీఎం కార్యదర్శిగా పనిచేశారు. 1990లో డీవైఎఫ్‌ఐ భద్రాచలం డివిజన్‌ అధ్యక్షుడిగా, 1994లో సీపీఎం డివిజన్‌ కార్యదర్శిగా నియమితులయ్యారు. తనకు మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి, సీపీఎం నేత బండారు చందర్‌రావు గురువులు అని చెప్పుకునేవారు. ఈ క్రమంలోనే తన కుమారుడికి చందర్‌రావు అని పేరు పెట్టారు. 1999లో తొలిసారి భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి చిచ్చడి శ్రీరామ్మూర్తిపై 6,349 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ పొత్తుతో మళ్లీ టీడీపీ అభ్యర్థి సోడె రామయ్యపై 14 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి కుంజా సత్యవతి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014 ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలం నియోజకవర్గంలోని మండలాలు ఏపీలో విలీనం కావడంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎప్పుడూ ప్రజా సమస్యలు, గిరిజనుల హక్కుల కోసం అసెంబ్లీలో గళమెత్తేవారు. తనదైన శైలితో అందరినీ ఆకట్టుకునేవారు. ఆర్టీసీ బస్సులో లేదా ఆటోలో అసెంబ్లీకి వెళ్లేవారు. తన నియోజకవర్గంలో అయితే ద్విచక్రవాహనంపైనే తిరుగుతూ, ప్రజా సమస్యలు తెలుసుకునేవారు. ఒకసారి రాజయ్య ఆటోలో అసెంబ్లీకి వెళ్లగా, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని గుర్తింపు కార్డు చూపించిన తర్వాత లోనికి అనుమతించారు. దీనిపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సైతం సున్నం రాజయ్యను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని, నియోజకవర్గంపై పట్టు సాధించాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించడం గమనార్హం. 

నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి..
ఎమ్మెల్యేగా భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి సున్నం రాజయ్య ఎనలేని కృషి చేశారు. ఈ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడకుండా వ్యవహరించారు. భద్రాచలంలో ప్రస్తుతం ఉన్న మూడో మంచినీటి ట్యాంక్‌ కోసం 2005లో విశేష కృషి చేశారు. తునికాకు అమ్మకాలపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఆకు సేకరించే కార్మికులకు బోనస్‌గా ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డిని పలుమార్లు కలిసి కోరగా, బోనస్‌ ఇచ్చేందుకు వైఎస్‌ అంగీకరించారు. తెలంగాణ ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం పోరాడారు. తాలిపేరు బ్రిడ్జి, వెంకటాపురంలోని పాలెంవాగు ప్రాజెక్ట్‌లు రాజయ్య కృషి వల్లే ఏర్పాటయ్యాయి. విశాఖపట్నంలో బాక్సైట్‌ భూముల కోసం, 1/70 చట్ట పరిరక్షణకు ఆయన ఎనలేని కృషి చేశారు. ప్రస్తుతం రాజయ్య ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సున్నం రాజయ్య మృతిపట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు అన్నవరపు కనకయ్య, నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య తదితరులు సంతాపం తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు