ఎన్నికలనాటి పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో పొత్తులు: సీపీఐ

18 Nov, 2022 04:09 IST|Sakshi

జాతీయస్థాయిలో ముందస్తు కూటమి

స్పష్టం చేసిన సీపీఐ ప్రధానకార్యదర్శి డి.రాజా

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో తమ పొత్తులు, అవగాహనలు ఉంటాయని సీపీఐ జాతీయ ప్రధా నకార్యదర్శి డి.రాజా స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే వామపక్ష, ప్రజాతంత్ర, లౌకికశక్తులు, ప్రాంతీయ పార్టీలతో తమ పార్టీ పొత్తు పెట్టు కుంటుందని వెల్లడించారు. తెలంగాణలోనూ ఇదే వైఖరి అవలంభిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ముందస్తుగానే ఒక కూటమి ఏర్పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన డి.రాజా గురువారం విలే కరులతో మాట్లాడారు.

2024లో జరగబోయే సాధారణ ఎన్నికలు అత్యంత కీలకమైనవన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ వాగ్దానం ఏమైందని రాజా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను గవర్నర్లు ముందుకు తీసుకెళ్తున్నారని, ఇటీవల తమిళనాడు గవర్నర్‌ సనా తన ధర్మాన్ని ప్రస్తావించిన విషయాన్ని రాజా గుర్తుచేశారు.

మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ముందుకెళ్లే అంశంలో తన ఆలోచనను మార్చుకోవాలని సూచించారు. అనేక ప్రాంతీయ పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని, బిహార్‌లో నితీశ్‌కుమార్, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ఒక కూటమిగా ఉన్నాయన్నారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో ముందుకు సాగుతామన్నారు. గుజరాత్‌లో బీజేపీ ఓటమిపాలైతే, అక్కడి నుంచే ఆ పార్టీ పతనం ప్రారంభం కానుందన్నారు. 

మిలియన్‌ సభ్యత్వాలు...
మరో రెండేళ్లలో సీపీఐ శతాబ్ది వార్షికోత్సవానికి చేరుకోబోతున్న సందర్భంగా మిలియన్‌ సభ్యత్వాలను చేర్పించాలని రాజా పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ ఫండ్స్‌లో బీజేపీకి ఎక్కువ వస్తున్నాయని, దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ పార్టీ బీజేపీ అని, అధికారంలోనికి వచ్చేందుకు ఆ పార్టీ విపరీతమైన డబ్బులను వెదజల్లుతోందని విమర్శించారు. ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 

టీఆర్‌ఎస్‌తో పొత్తుపై ఇప్పుడేమీ చెప్పలేం: కూనంనేని
ఎన్నికల పొత్తులో భాగంగా తాము బలంగా ఉన్న నల్లగొండ, ఇతర జిల్లాల్లోని స్థానాలను అడుగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. బీజేపీని ఓడించే బల మైన ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలతోనే ఎన్నికల అవగాహన ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని స్పష్టంచేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడు తూ.. ప్రైవేటు విమానాల ద్వారా హవాలా డబ్బు, బంగారు ఆభ రణాలు తరలుతున్న నేపథ్యంలో ప్రైవేటు విమానాలలో తనిఖీ చేపట్టాలని, వీటిని నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్‌ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?

మరిన్ని వార్తలు