సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే..

27 Mar, 2021 03:29 IST|Sakshi

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం భారత్‌బంద్‌లో భాగంగా ఆల్‌ ట్రేడ్‌ యూనియన్స్, రైతు సంఘాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ మీదుగా వైఎంసీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయాలకు కాలం చెల్లిందని, ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలని అన్నారు.

రైతులపై నిర్బంధాన్ని ఆపటంతోపాటు డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుచట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ రైతే రాజు అని అంటున్న సీఎం కేసిఆర్‌ వారు పండించిన పంటలను ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. చర్చల పేరుతో రైతు సంఘాల నాయకులను కేంద్రం పిలిచి నాటకాలు ఆడుతోందని విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయా సంఘాల కార్యకర్తలు, నాయకులు ప్లకార్డులను ప్రదర్శించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేత నారాయణ, రైతు సంఘాల నాయకులు టి.సాగర్, పశ్య పద్మ, కెచ్చల రంగయ్య, అచ్చుత రామారావు, ఉపేందర్‌రెడ్డి, జక్కుల వెంకటయ్య, కన్నెగంటి రవి, బి.ప్రసాద్, ఆర్‌.వెంకట్రాములు, న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, సాదినేని వెంకటేశ్వర్‌రావు, గాదగోని రవి, ఎస్‌.ఎల్‌.పద్మ, జి.అనురాధ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు