నేడు నెలవంక  కనపడితే  22న రంజాన్‌ పండుగ

21 Apr, 2023 04:13 IST|Sakshi

లేని పక్షంలో ఈ నెల 23న పండుగ  

రుహియతే హిలాల్‌ కమిటీ ప్రకటన ఆధారంగా పండుగ

సాక్షి, హైదరాబాద్‌: శుక్రవారం నెలవంక కనిపిస్తే శనివారం రంజాన్‌ పండుగ ఉంటుందని, లేని పక్షంలో ముస్లింలు ఆదివారం పండుగను జరుపుకోవాలని రుహియతే హిలాల్‌ కమిటీ ప్రతినిధి ముఫ్తీ మహ్మద్‌ ఖలీల్‌ అహ్మద్‌ చెప్పారు. రుహియతే హిలాల్‌ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ ) శుక్రవారం దీనిపై స్పష్టతనిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇస్లాంలో రంజాన్‌ చివరి శుక్రవారానికి ఎక్కువ ప్రధాన్యం ఇస్తారు.

ఈ రోజు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి దేవుని ఆశీస్సులు పొందుతారు. జుమ్మతుల్‌ విదాను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అన్ని మసీదుల్లో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా మక్కా మసీదు, పబ్లిక్‌ గార్డెన్స్‌లోని రాయల్‌ మసీదులో జుమ్మతుల్‌ విదా ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యలో ఆయా జోన్‌లలో మసీదు పరిసరాలను శుభ్రం చేశారు.  

ఈద్గాలలో నమాజ్‌ కోసం ఏర్పాట్లు: శని లేదా ఆదివారం రంజాన్‌ పండుగ నేపథ్యంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అన్ని ఈద్గాలలో పండుగ రోజు నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు గురువారం రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ మసీవుల్లా ఖాన్‌ తెలిపారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈద్గాల కమిటీలకు కూడా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. హైదరాబాద్‌లోని మీరాలం, మాదన్నపేట్‌ ఈద్గాలను సందర్శించి ఏర్పాట్లు సమీక్షించామన్నారు. అలాగే గ్రేటర్‌ పరిధిలోని పలు మైదానాల్లో కూడా రంజాన్‌ పండుగ నమాజ్‌ కోసం ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించామని తెలిపారు.

మరిన్ని వార్తలు