స్వప్నలోక్‌ ప్రమాదం.. మరోసారి తెరపైకి క్యూనెట్‌ చీకటి దంగా.. క్రిమినల్‌ కేసు

22 Mar, 2023 11:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోని క్యూ–నెట్‌ సంస్థ చీకటి దందా మరోసారి తెరపైకి తెచ్చింది. ఆ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురు యువతీయువకులూ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న ఈ సంస్థ ఉద్యోగులే. ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగిన మర్నాటి నుంచి దీనిపై పోలీసులు దృష్టి పెట్టారు. మాదసి నవీన్‌ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోని ఐదో అంతస్తులో ఉన్న క్యూ–నెట్‌–విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కార్యాలయం కొనసాగుతోంది. ‘వి–ఎంపైర్‌’పేరుతోనూ కొనసాగుతున్న ఈ సంస్థలో అనేక మంది పని చేస్తున్నారు. ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించడం పేరుతో క్యూ–నెట్‌ సంస్థ మల్టీ లెవల్‌ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్స్‌కు తెరలేపడంపై గతంలో సీఐడీ సహా అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. దాంతో కొన్నాళ్లు మిన్నకుండిపోయిన ఈ సంస్థ ఇటీవలే మళ్లీ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. 

వెస్ట్‌ మారేడ్‌పల్లి ప్రాంతంలో నివసిస్తున్న వరంగల్‌ వాసి మాదసి నవీన్, స్వప్నలోక్‌ అగ్ని ప్రమాదంలో చనిపోయిన బానోత్‌ శ్రావణి స్నేహితులు. శ్రావణి ద్వారానే నవీన్‌కు ‘వి–ఎంపైర్‌’సంస్థ కార్యకలాపాలు తెలిశాయి. తమ సంస్థలో చేరితే ప్రతి నెలా రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకు ఆర్జించవచ్చని ఆమె చెప్పడంతో నవీన్‌ గతేడాది ఆక్టోబర్‌లో ‘వి–ఎంపైర్‌’లో చేరాడు.

రూ.1.6 లక్షలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న అతనికి ఇద్దరు సభ్యులను చేరిస్తే కమీషన్ల రూపంలో నగదు వస్తుందని సూచించారు. కానీ ఇప్పటివరకు రూపాయి కూడా చెల్లించలేదు. ఈ సంస్థలో చేరాకే నవీన్‌కు వి–ఎంపైర్‌ అన్నది మలేసియాకు చెందిన క్యూ–నెట్‌లో భాగమని తెలిసింది. ఇక్కడ విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి కార్యకలాపాలు సాగిస్తోందని తెలుసుకున్నాడు. నిషిద్ధ మనీ సర్క్యులేషన్, మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ దందాలు చేస్తున్న ఈ సంస్థను బెంగళూరుకు చెందిన రాజేష్‌ ఖన్న నిర్వహిస్తున్నాడని నవీన్‌ గుర్తించాడు. 

మరిన్ని వార్తలు