వ్యవసాయ భూమి... ఐదెకరాల్లోపే ఉండాలి

25 Jan, 2021 08:10 IST|Sakshi

వార్షికాదాయం రూ.8 లక్షల్లోపు ఉండాలి

1,000 చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఇళ్లు ఉండొద్దు 

పురపాలికల్లో 100,  గ్రామాల్లో 200 గజాలకు పైగా ఇంటి స్థలం ఉన్నా అనర్హులే

ఈడబ్ల్యూఎస్‌ అమలుకు కేంద్రం నిబంధనలివీ

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లకు కుటుంబ వార్షిక ఆదాయం ఒక్కటే కొలమానం కాదు. ఇతరత్రా ఆస్తులనూ పరిగణనలోకి తీసుకుంటారు. కుటుంబానికి ఐదెకరాలు, ఆపై వ్యవసాయ భూమి ఉంటే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అనర్హులే. అలాగే 1,000 చదరపు అడుగులు, ఆపై వైశాల్యంలో నివాస గృహం/ఫ్లాట్‌ ఉన్నా ఈ రిజర్వేషన్‌ వర్తించదు. నోటిఫైడ్‌ పురపాలికలు, మున్సిపాలిటీల్లో 100 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస స్థలం(ప్లాట్‌) కలిగి ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో 200 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస స్థలం కలిగి ఉన్నా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తించవు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండి, పైన పేర్కొన్న పరిమితుల్లోపు స్థిరాస్తులు ఉంటేనే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

ఈ మేరకు ఈడబ్ల్యూఎస్‌  అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) 2019 జనవరి 19న ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ... లాంటి ఏ ఇతర రిజర్వేషన్ల కిందకు రాని వారు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటాకు అర్హులు. యూపీఎస్సీతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్‌ పేరుతో అగ్ర కుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.(చదవండి: ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటా: కేసీఆర్‌ ప్రకటన)

ఈ క్రమంలో... దాదాపు రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో సైతం 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు మూడు రోజుల్లో సమీక్ష నిర్వహించి ఈ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ చేస్తామని ఈ నెల 21న సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎవరికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయి? అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు జారీ చేయ బోతోంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో  ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు అవకాశాలున్నాయి.

కుటుంబ ఆదాయ గణన ఇలా.. 
ఈడబ్ల్యూఎస్‌ కోటా కోరుకునే వ్యక్తి కుటుంబ వార్షిక వేతనం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఇక్కడ కుటుంబ వార్షిక ఆదాయాన్ని లెక్కించే సమయంలో సదరు వ్యక్తి తల్లిదండ్రులు, 18 ఏళ్లలోపు ఉన్న తొబుట్టువులు, జీవిత భాగస్వామి, 18 ఏళ్లలోపు ఉన్న సంతానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కుటుంబంలో 18 ఏళ్లకు పైబడిన తోబుట్టువులు, సంతానమున్నా వారి ఆదాయాన్ని కుటుంబ ఆదాయం కింద లెక్కించరు. కుటుంబ సభ్యుల వేతనాలు, వ్యవసాయం, వ్యాపారం, వృతి అన్ని మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని కుటుంబ ఆదాయంగా లెక్కిస్తారు. 

మరిన్ని వార్తలు