కిషన్‌రెడ్డిది విఫలయాత్ర!

22 Aug, 2021 02:00 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి. చిత్రంలో బాల్కసుమన్‌ 

మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌  

రేవంత్, సంజయ్‌లాగే దిగజారి వ్యాఖ్యానిస్తున్నారని విమర్శ 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చేపట్టిన ‘జన ఆశీర్వాదయాత్ర’ఒక విఫలయాత్ర అని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన కేంద్ర కేబినెట్‌మంత్రిగా ఉన్నా తెలంగాణకు ఏమాత్రం మేలు చేయలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో కలసి ఎర్రబెల్లి శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ మోసపూరిత పార్టీ, ఎన్నికలప్పుడు మాయమాటలతో ఓట్లు దండుకుంటుంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యవహారశైలి వల్లే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ దెబ్బతింది. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధుల కంటే అదనంగా నయాపైసా కూడా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కేంద్రం డీజిల్‌ ధరలు పెంచి ప్రజల మీద భారం వేసింది. అలాంటి ఒక్క పనిని కూడా సీఎం కేసీఆర్‌ చేయడం లేదు. పర్యాటక రంగంలో వెనుకబడిన తెలంగాణ కు కేంద్రమంత్రి హోదాలో కిషన్‌రెడ్డి ఏం చేస్తారో వెల్లడించాలి’అని ఎర్రబెల్లి డిమాండ్‌ చేశారు.  

మాట్లాడేందుకు మరో అంశం లేదు 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ తరహాలో కిషన్‌రెడ్డి కూడా తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విమర్శించారు. ‘మా ప్రభుత్వంపై మాట్లాడేందుకు ఏ అంశమూ లేనందునే కుటుంబ, వారసత్వ రాజకీయాలు అంటూ విమర్శలు చేస్తున్నారు.

మరి బీజేపీలోనూ నేతల వారసులున్నారు కదా’అని వ్యాఖ్యానించారు. దళితబంధు కింద రాష్ట్రం ఇస్తున్న రూ.10 లక్షలకు అదనంగా మరో రూ.40 లక్షలను కేంద్రం నుంచి ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ‘గెల్లు శ్రీనివాస్‌ గెలుపు శ్రీనివాస్‌గా మారారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రూ.9 కోట్లతో కుంకుమ భరిణిలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు’అని సుమన్‌ ఆరోపించారు.  

మరిన్ని వార్తలు