సివిల్‌ వివాదాల్లో ఖాకీల జోక్యం!

14 Aug, 2020 08:24 IST|Sakshi

పట్టాదారు పాసుపుస్తకాల పంచాయితీ ఠాణాల్లో?

వారంలో రెండు ఘటనలపై మానవ హక్కుల సంఘం జోక్యం

సాక్షి, హైదరాబాద్ ‌: సివిల్‌ వివాదాల్లో పోలీసులు తలదూర్చి ఫిర్యాదుదారులపై బెదిరింపులకు దిగుతున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ వారంలో ఈ విధమైన రెండు ఘటనల్లో రాష్ట్ర మానవహక్కుల సంఘం (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) కలగజేసుకుందంటే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా నాగారం ఎస్సై ఓ భూవివాదంలో అకారణం గా దళితులపై దాడి చేశారని, చంపుతానని బెదిరించారనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర మానవ హక్కుల సంఘం దీన్ని సుమోటాగా స్వీకరించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఎస్పీ భాస్కరన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ విమర్శల నేపథ్యంలో స్పందించిన ఎస్పీ సదరు ఎస్సైని వీఆర్‌కు పంపారు. గతంలోనూ ఈ అధికారిపై ఇలాంటి ఆరోపణలున్నా యి. అదే జిల్లాలోని మునగాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది. తన భూమిని ఆక్రమిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినా ఎస్సై పట్టించుకోకపోగా దూషించి వెనక్కి పంపడంతో బాధితుడు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ విషయంపై విచారణ జరిపించాలని హెచ్చార్సీ సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

భూపంచాయితీలంటే ఎంత ఇష్టమో! 
రాష్ట్రంలో పట్టాదారు పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులు ఎంతమందిని బలి తీసుకుంటున్నా యో చూస్తున్నాం. ఈ క్రమంలో తలెత్తుతున్న వివాదాల నేపథ్యంలో బాధితులు ముందుగా పోలీసులనే ఆశ్రయియిస్తున్నారు. దీన్ని కొందరు పోలీసులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వాస్తవానికి సివిల్‌ కేసులు పోలీసుల పరిధిలోనివి కావు. కానీ, ఇలాంటి వివాదాలపై పోలీసులు ఠాణాల్లోనే పంచాయితీలు పెట్టి రెండు వర్గాల నుంచి డబ్బులు దం డుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దీంతో బాధితులు ఎస్పీలు, మానవ హక్కుల సం ఘాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు ఎవరో ఒకరి పక్షం వహించడం వల్ల ఒకవర్గం మరోవర్గంపై దాడులు, బెదిరింపులకు దిగుతోంది. వీరంతా పేదలు, బలహీనులు కావడంతో భయపడి చాలామంది రాజీకే మొగ్గు చూపుతున్నారు. అందుకే, ఇలాంటి విషయాలు తక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నా కొందరి తీరు మారడం లేదు.

డీజీపీ ఆదేశాలు బేఖాతరేనా?
సివిల్‌ వివాదాల్లో తలదూర్చొద్దని, స్టేషన్ల చుట్టూ పదే పదే బాధితులను తిప్పించుకోవద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి పలుమార్లు హెచ్చరించారు. ఇలాంటి వైఖరి హత్యలు, అల్లర్లు, శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తుందని చెప్పినా చాలామంది గ్రామీణ పోలీసుల తీరు లో మార్పు రావట్లేదు. విచారణలో తప్పు రుజువై వేటు పడుతున్నా కొందరు కిందిస్థా యి పోలీసు అధికారుల తీరు మారడంలేదు. కొంతకాలం తరువాత పోస్టింగ్‌ వస్తుందన్న ధీమాతో బరితెగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు