14 లక్షల ఎకరాల్లో పంట నష్టం

22 Oct, 2020 04:00 IST|Sakshi

ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పరిస్థితి

సాక్షి, హైదరాబాద్‌: రోజురోజుకూ పంట నష్టం పెరుగుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో దాదాపు 14 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, ఆ తర్వాత 12 లక్షల ఎకరాలకు చేరిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అయితే బుధవారం నాటికి అది కాస్తా 14 లక్షల ఎకరాలకు చేరి ఉండొచ్చని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే తుది నివేదిక ఇంకా రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకే ఇంత నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ఈ వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

వరి దాదాపు 5,10,216 ఎకరాలు, పత్తి 7,50,150 ఎకరాలు, ఇంకా ఇతర పంటలు కలిపి 14,06,110 ఎకరాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఓ అంచనా ప్రకారం దాదాపు 7,60,138 మంది రైతులు పంటలు నష్టపోయినట్లు తెలిసింది. అయితే నష్టం రూ.వేల కోట్లలో ఉంటుందంటున్నారు. అన్నదాత గగ్గోలు..: వరి, పత్తికి కనిష్టంగా రూ.25 వేలు, గరిష్టంగా రూ.35 వేల చొప్పున రైతులు పెట్టుబడి పెట్టారు. వరదలు, వర్షాలతో పెట్టుబడి మొత్తం కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో నష్ట పరిహారం అందజేయలని కోరుతున్నారు. కాగా, ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం నుంచి వైదొలిగింది. దీంతో పంటల బీమా కూడా అందే దిక్కు లేకుండా పోయిం ది.

ఎలాంటి బీమా పథకాలు ఈ వానాకాలం సీజన్‌లో అమలు చేయకపోవడంతో చాలా నష్టం వాటిల్లింది. రైతు యూనిట్‌గా పంటల బీమా కోసం కేంద్రా న్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో డిమాండ్‌ చేసింది. అయితే అది అమల్లోకి రాలేదు. ఇప్పుడు కేంద్ర పథకం నుంచి వైదొలగడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో ప్రత్యేకంగా పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కసరత్తు జరిగింది. కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు దానిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం ఇచ్చే పరిహారంపైనే ఆశలున్నాయి. 

మరిన్ని వార్తలు