పంటలకు వరద పోటు..

24 Jul, 2021 02:06 IST|Sakshi
జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలో నాటు వేసిన పొలంలో ఇసుక మేటలు

భారీ వర్షాలతో పలు జిల్లాల్లోనీట మునిగిన పొలాలు 

వేలాది ఎకరాల్లో పత్తి పంటకు, వరినాట్లకు దెబ్బ

కొన్నిచోట్ల ప్రవాహంలో కొట్టుకుపోయిన వరినాట్లు

సాక్షి, నెట్‌వర్క్‌: భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. ప్రధానంగా పత్తి పంట దెబ్బ తినగా, నాట్లు వేసిన వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. కొన్ని చోట్ల నీటి ప్రవాహానికి మొక్కలు కొట్టుకుపోయాయి. మంచిర్యాల జిల్లాలో ఏటా ప్రాణహిత తీరంలో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా.. గత రెండు రోజులుగా కురిసిన వానలతో వేలాది ఎకరాల్లో భారీగా వరద నీరు చేరింది. పత్తి చేనుల్లో నీటి చేరికతో పాటు ఇసుక మేటలు వేయడంతో పత్తి మొలక, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా వరి నాట్లు వేస్తుండగా, ఈ వర్షాలతో నారు ఎదగకుండా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 6,864 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 5, 099 ఎకరాల్లో పత్తి, 1,447 ఎకరాల్లో వరి, 312 ఎకరాల్లో మిరప, 6 ఎకరాల్లో కంది నీట మునిగింది.

పత్తికే ఎక్కువ నష్టం
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వానాకాలం సీజన్‌లో సుమారు 6 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా వేయగా, ఇప్పటివరకు సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. అలాగే సుమారు లక్ష న్నర ఎకరాల్లో పత్తి పంట వేశారు. భారీ వర్షాలతో చాలాచోట్ల ఇప్పటికే వేసిన వరి నాట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం తో పొలాలు మునిగిపోయాయి.

పల్లపు ప్రాంతాల్లో పంటల మునక
ఖమ్మం జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 2,70,000 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1,82,068 ఎకరాల్లో పంట వేశారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2,52,500 ఎకరాలు కాగా.. ఇప్పటికి 49,233 ఎకరాల్లో నాట్లు వేశారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో పల్లపు ప్రాంతాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. ఇక నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 2.86 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. అలాగే పత్తి 2,363 ఎకరాల్లో సాగైంది.

మరిన్ని వార్తలు