పంటలన్నీ వర్షార్పణం

19 Jul, 2022 02:24 IST|Sakshi
పత్తి చేనును వరద ముంచిందంటూ బాధపడుతున్న పెద్దపల్లి జిల్లా పోతారం గ్రామ రైతు ప్రభాకర్‌

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలకు కొట్టుకుపోయిన పంటలు

సుమారు 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా

దాదాపు రూ. 1,200 కోట్ల మేర కోల్పోయిన అన్నదాతలు

చాలాచోట్ల పంటలపై ఇసుక మేటలు.. నిండామునిగామని రైతుల ఆవేదన

మళ్లీ విత్తులకు రూ. వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక జిల్లాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. మొలక దశలో ఉండటం వల్ల అనేక పంటలు కొట్టుకుపోగా కొన్నిచోట్ల వాటిపై పూర్తిగా ఇసుక మేటలు వేసింది. మరికొన్నిచోట్ల నీటిలో మొలకలు మురిగిపోయాయి. ప్రాథమిక అంచనా ప్రకారమే 11 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి నష్టం సంభవించింది. మరోవైపు ఇప్పటికే సాగు దశలో ఉన్న వరితోపాటు మొలక దశలో ఉన్న పత్తి నాశనమైంది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 1,200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. అయితే అధికారికంగా పూర్తిస్థాయిలో అంచనాలు ఇంకా రూపొందించలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ విత్తనాలను వేయాలంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులు రూ. వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్‌ మొదటి వారం నుంచే రైతులు పత్తి, మొక్కజొన్న విత్తడంతో మళ్లీ నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండోసారి నాటిన రైతులు వానలతో మూడోసారి విత్తనాలను విత్తాల్సిన పరిస్థితి. దీంతో ఖర్చు పెరిగిపోతుందని వాపోతున్నారు.

భారీగా పత్తి నష్టం...
ఈ సీజన్‌లో ఇప్పటివరకు పత్తి 38.48 లక్షల ఎకరాల్లో సాగు అయింది. వానలతో సుమారు 8 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. ఇప్పటివరకు ఒక్కో ఎకరానికి సుమారు రూ. 10 వేల వరకు సరాసరి రైతులు పెట్టుబడిగా పెట్టారు. మొత్తం పత్తి సాగుకు ఎకరానికి రెండు విత్తన ప్యాకెట్ల చొప్పున సుమారు 76.96 లక్షల విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారు.

ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి ప్రకారం పరిశీలిస్తే 8 లక్షల ఎకరాల్లో సుమారు రూ. 800 కోట్ల నష్టం ఒక్క పత్తిలోనే సంభవించిందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వరి, కంది, సోయాబీన్, మొక్కజొన్న పంటలకూ భారీగానే నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. సోయాబీన్‌కు అధిక వానలు మరింత నష్టాన్ని కలిగించాయి. వరి చాలా వరకు వరద నీటిలో మునగడంతో ఎర్రబారిపోయింది. కంది, మొక్కజొన్న మొలక దశకు చేరుకున్నప్పటికీ అధిక పదును, వరద నీరు పారడంతో కొట్టుకుపోయింది. ఈ పంటలన్నింటికీ కలిపి సుమారు రూ. 400 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం.

జిల్లాలవారీగా...
నిజామాబాద్‌ జిల్లాలో 49,591 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 143 గ్రామాల్లో 2,900 మంది రైతులు 5,620 ఎకరాల్లో పంటను నష్టపోయారు. మంచిర్యాల జిల్లాలో 27,592 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 45,420 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 1.03 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 29,085 మంది రైతులు నష్టపోయారు. నిర్మల్‌ జిల్లాలో మొత్తం 20,293 ఎకరాల్లో నష్టం వాటిల్లింది.

మళ్లీ విత్తనాలు వేయాల్సిందే...
వర్షాలకు పంటలు దెబ్బతిన్న సుమారు 11 లక్షల ఎకరాల్లోనూ తిరిగి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు అంటున్నాయి. అయితే రెండోసారి విత్తాల్సి ఉన్నా కొన్నిచోట్ల భూమి అనుకూలిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇతర పంటల వైపు మళ్లాలా లేదా అనేది వ్యవసాయశాఖ అంచనా వేయాల్సి ఉంటుంది.

విత్తనాలు సిద్ధంగా ఉంచాం..
రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఎక్కడైనా రెండోసారి విత్తాల్సి వస్తే ఆ మేరకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను సిద్ధంగా ఉంచాం. పత్తి, వరి విత్తనాలను ప్రైవేటు కంపెనీలు సిద్ధం చేసినందున ఎక్కడా ఇబ్బంది తలెత్తదు. పంట నష్టం అంచనాపై ఇప్పటివరకు జిల్లాలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కొన్నాళ్లుగా విత్తనాలకు సబ్సిడీ ఇవ్వడంలేదు. కాబట్టి ఈసారి అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు.
– రఘునందన్‌రావు, కార్యదర్శి, వ్యవసాయశాఖ

ప్రభుత్వం ఆదుకోవాలి...
మూడెకరాల్లో పత్తి వేశా. విత్తనాలు, దుక్కులు, ఇతరత్రా ఖర్చులకు ఎకరానికి రూ. 30 వేల పెట్టుబడి పెట్టా. గోదావరి బ్యాక్‌వాటర్‌తో ఈసారి పంటంతా నీట మునిగింది. ఇసుక మేటలు వేసింది. పొలంలో విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో కరెంట్‌ బంద్‌ చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలి.
– బోగిరి ప్రభాకర్, పోతారం, మంథని

నష్టపరిహారం చెల్లించాలి...
నాలుగు ఎకరాల్లో పత్తి వేశా. విత్తనాలు, కూలీలకు కలిపి మొత్తం రూ. 30 వేలు ఖర్చయింది. విత్తనాలు మొలకెత్తకముందే వర్షానికి కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలి. 
పంబలి సాయిలు, జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్‌ మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

మరిన్ని వార్తలు