కాకులకు ఏమైందో? 

1 Nov, 2021 01:10 IST|Sakshi
రాజీవ్‌ గృహకల్పలో చనిపోయిన కాకులు

వికారాబాద్‌లో పదుల సంఖ్యలో మృతి

వికారాబాద్‌ అర్బన్‌: పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో ఆదివారం సుమారు 20 కాకులు మృత్యువాతపడ్డాయి. వికారాబాద్‌ నుంచి అనంతగిరి వెళ్లే ప్రధాన రోడ్డు పక్కనే రాజీవ్‌నగర్‌ ఉంది. కాలనీకి ఆనుకుని రోడ్డుకు ఇరువైపులా పెద్దపెద్ద మర్రి, మామిడి చెట్లు ఉన్నాయి. ఆదివారం ఉదయం ఉన్నట్టుండి చెట్ల పైనుంచి కాకులు కిందపడటం, కొద్దిసేపు గిలగిలా కొట్టుకొని చనిపోవడాన్ని స్థానికులు గమనించారు. ఒకటి తర్వాత ఒకటి సుమారు 20 కాకులు మృత్యువాత పడ్డాయి.

అదేవిధంగా కాలనీలోని పలువురి ఇళ్ల ఎదుట ఉన్న చెట్ల మీది నుంచి కూడా కాకులు పడిపోగా కొందరు మంచినీరు తాగించి బతికించే ప్రయత్నం చేశారు. ఏమైనా విషాహారం తిని ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కరోనా ప్రారంభంలోనూ వికారాబాద్‌ పట్టణంలో తొలిసారిగా రాజీవ్‌నగర్‌ కాలనీలోనే రెడ్‌జోన్‌ ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కాకుల మృతితో భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే కారణాలు తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

పోస్టుమార్టం చేస్తాం 
పాయిజన్‌ కలిసిన నీళ్లు తాగడంతో కాకులు మృతిచెంది ఉండొచ్చు. ఆదివారం వాటి కళేబరాలను సేకరించాం. పోస్టుమార్టం నిర్వహించి కారణాలు తెలుసుకుంటాం.  
– సదానందం, జిల్లా పశువైద్యాధికారి   

మరిన్ని వార్తలు