ట్రెండ్‌ సెట్టర్‌గా ధరణి

28 Oct, 2020 01:40 IST|Sakshi
రెవెన్యూ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను ఇబ్బంది లేకుండా చేయాలి 

తహసీల్దార్ల బాధ్యతలు మరింత పెరుగుతాయి 

పోర్టల్‌పై సీఎం అంచనాలను అందుకోవాలి

రెవెన్యూ అధికారులకు శిక్షణలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌  

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ, వ్యవసాయేత ఆస్తుల తక్షణ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ధరణి పోర్టల్‌ దేశంలోనే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలవనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ అన్నారు. ఈ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ సేవల్లో రెవెన్యూ అధికారుల బాధ్యత మరింత పెరిగిందని, వారు రెవెన్యూ విధులతో పాటు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గానూ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు ఒక బృంద పనితీరుతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ధరణి పోర్టల్‌పై మంగళవారం ఇక్కడ రెవెన్యూ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో సీఎస్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈ నెల 29న ధరణిని ప్రారంభించనున్నారని, ఆయన అంచనాల మేరకు సులభంగా, పారదర్శకంగా, వేగంగా ప్రజలకు సేవలందించాలని రెవెన్యూ సిబ్బందిని సీఎస్‌ ఆదేశించారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ వెంటనే జరగాలన్నారు.  

సాంకేతిక సమస్యల పరిష్కారానికి కంట్రోల్‌ రూమ్‌... 
ధరణి పోర్టల్‌ పనితీరును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రెవెన్యూ అధికారులకు సీఎస్‌ వివరించారు. స్లాట్‌ బుకింగ్, సిటిజన్‌ ఓపెన్‌ పోర్టల్‌ సక్సెసర్‌ మాడ్యూల్స్, పార్టిషన్‌ మాడ్యూల్స్‌ ఎలా చేయాలో తెలిపారు. తహసీల్దార్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల విధులు, బాధ్యతలను వివరించారు. ధరణి సాంకేతిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే కంట్రోల్‌ రూంతో పాటు జిల్లా స్థాయి టెక్నికల్‌ సపోర్ట్‌ బృందాలు పనిచేస్తాయని చెప్పారు. ధరణి పటిష్ట అమలుకు అవసరమైన సౌకర్యాలను తహసీల్దార్‌ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, రెవెన్యూ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా పాల్గొన్నారు.  

మూడుచింతలపల్లిలో ధరణికి శ్రీకారం 

  • రేపు పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌  

శామీర్‌పేట/హైదరాబాద్‌: వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల తక్షణ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌కు వేదిక, ముహూర్తం ఖరారయ్యాయి. మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం, మండల కేంద్రమైన మూడుచింతలపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో పోర్టల్‌ను ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్, పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పోర్టల్‌లో అందించే సేవలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రెవెన్యూ అధికారులకు సీఎస్‌ వివరించారు. అలాగే సీఎం మరో దత్తత గ్రామమైన లింగాపూర్‌ తండాలోనూ సీఎస్, సీపీ, పలువురు ఉన్నతాధికారులు పర్యటించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా