వేసవికాలం మండే ఎండలు.. ఆ పంటతో అదిరిపోయే లాభాలు!

5 May, 2022 22:43 IST|Sakshi
కోతకు వచ్చిన కీరదోసలను చూపిస్తున్న రైతు అస్తక్‌ సుభాష్‌

జైనథ్‌(ఆదిలాబాద్‌): నీటి వసతి ఉన్న చేన్లలో సైతం సాధారణంగా రెండు పంటలు తీయడానికి రైతులు నానా అవస్థలు పడుతుంటారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక, పెట్టిన పెట్టుబడి చేతికి అందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. కా నీ జైనథ్‌ మండలం పార్డి గ్రామానికి చెందిన అస్తక్‌ సుభాష్‌ పాలీహౌస్‌తో కేవలం ఒక ఎకరంలోనే సంవత్సరానికి మూడు పంటలు తీస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం వేసవికాలంలో ఎండలు దంచి కొడుతున్న తరుణంలో కూడా పాలీహౌజ్‌లో కీరదోస సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.

సంప్రదాయ పంటలతో విసిగి..
చాలా మంది రైతులు ఏళ్లతరబడి సంప్రదాయ పంటలైన పత్తి, సోయా, ఇతర పప్పుధాన్యాల సాగును అంటిపెట్టుకుని యేటా నష్టాలు చవిచూస్తుంటారు. అయితే కొంత మంది రైతులు మాత్రం పత్తి, సోయా వంటి పంటలకు భిన్నంగా హార్టికల్చర్‌ వైపు దృష్టి సారిస్తున్నారు. నాలుగైదు ఏళ్లుగా పత్తి పంటను గులాబీరంగు పురుగు ఆశించడంతో దిగుబడి భారీ గా పడిపోతోంది. సోయాలో కూడా గతంలో మాది రి ఆశించిన దిగుబడి రాకపోవడంతో విసిగిపోయిన రైతులు పండ్లు, కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయలు, పండ్ల సాగుకు అధికంగా శ్రమించాల్సి రావడంతో చాలా తక్కువ మంది మాత్రమే నిలదొక్కుకుంటున్నారు. పార్డి గ్రామానికి చెందిన అస్తక్‌ సుభాష్‌ కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయ పంటల జోలికి పోకుండా పాలీహౌస్‌లో మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కీరదోస, కాలీఫ్లవర్, క్యాప్సికమ్‌ వంటి పంటలను సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. మిగిలిన భూమిలో కూడా కాకర, బీరకాయ, టమాట, జొన్న, నువ్వులు వంటి పంటలు సాగు చేస్తున్నాడు.

250 క్వింటాళ్ల దిగుబడి
సాధారణంగా కీరదోసకు మార్కెట్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్‌ ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే కీరదోస హాట్‌కేక్‌లా అమ్ముడుపోతుంది. ఇది గ్రహించిన రైతు సుభాష్‌ తన పాలీహౌజ్‌లో వేసవి ప్రారంభంలో ఫిబ్రవరి మాసంలో ఎకరం విస్తీర్ణంలో కీరదోస సాగు చేశాడు. రూ.82వేలతో గుజరాత్‌ నుంచి నాణ్యమైన విత్తనాలు తెప్పించాడు. ఎరువులు, కూలీ ఖర్చు కలిపి మరో రూ.70వేల వరకు అయ్యింది. మొత్తం రూ.1.50 లక్షల్లో కీర సాగు పూర్తి అయ్యింది. మార్చి చివరి నుంచి పంట దిగుబడి రావడం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 200 క్వింటాళ్ల దోస మార్కెట్‌కు తరలించాడు. మరో 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాడు. క్వింటాల్‌కు రూ.2వేల చొప్పున ఇప్పటి వరకు రూ.4 లక్షల ఆదాయం వచ్చిందని, మరో రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతు పేర్కొంటున్నాడు. ఈ ఏడాది సకాలంలో పంట వేయడం, మార్కెట్‌లో మంచి ధర లభించడంతో మంచి లాభాలు వచ్చాయంటున్నాడు.

మరిన్ని వార్తలు