హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ రోజులు: రోడ్లన్నీ వెలవెల

20 Apr, 2021 22:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మళ్లీ లాక్‌డౌన్‌ రోజులు గుర్తుకు వస్తున్నాయి. ప్రస్తుతం రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో హైదరాబాద్‌ రోడ్లు మళ్లీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన రోడ్లతో పాటు గల్లీ రోడ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనా విజృంభణతో హైకోర్టు మొట్టికాయలు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కర్ఫ్యూ  అమలును పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఉప్పల్‌ రింగ్‌ రోడ్డులో మహేశ్‌ భగవత్‌, కూకట్‌పల్లిలో సజ్జనార్‌ కర్ఫ్యూ అమలును పర్యవేక్షించారు. కర్ఫ్యూ నేపథ్యంలో ఎల్బీనగర్ నాగోల్, ఉప్పల్, జెన్ పాక్ట్ వద్ద రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌ భగవత్, మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి వాహనాల తనిఖీ నిర్వహించారు.

ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ స్పష్టంగా కనిపించింది. ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేస్తుండడంతో ప్రజలు ఎవరూ బయటకు రాలేదు. అక్కడక్కడ ప్రజలు బయటకు రాగా పోలీసులు నిలువరించి వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. వైద్యం, ఆహారం, మీడియా తదితర రంగాలకు సంబంధించిన వారిని వదిలిపెట్టారు.

హైదరాబాద్‌లో కర్ఫ్యూ ఫొటోలు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు