న్యూ ఇయర్‌ ఈవెంట్లపై సీపీ సీవీ ఆనంద్‌ కీలక వ్యాఖ్యలు

19 Dec, 2022 02:23 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని న్యూ ఇయర్‌ ఈవెంట్ల నిర్వాహకులు కచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన ఆదివారం పేర్కొన్నారు. ఈ నెల 21 (బుధవారం) లోపు దరఖాస్తు చేసుకుని పొందాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. 

ఈ నెల 31 రాత్రి హోటల్స్, పబ్స్, క్లబ్స్‌ తదితరాలు అర్ధరాత్రి ఒంటి గంట (తెల్లవారితే జనవరి 1) వరకే పని చేయాలని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలు, అవసరమైన స్థాయిలో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు, తగినంత పార్కింగ్‌ స్థలం కచి్చతమని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజే తదితరాలకు అనుమతి లేదు. కార్యక్రమం జరిగే ప్రాంతం బయటకు శబ్దం వినిపించకూడదు. దీన్ని అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తారు. అసభ్య వస్త్రధారణ, అభ్యంతరకరమైన నృత్యాలకు తావుండకూడదు. మాదకద్రవ్యాల వినియోగానికి నిర్వాహకులూ బాధ్యులవుతారని ఆనంద్‌ స్పష్టం చేశారు. 

నిర్వాహకులు కార్యక్రమం జరిగే ప్రాంతంలోనే పార్కింగ్‌ సౌకర్యం కలి్పంచాలి. మద్యం మత్తులో ఉన్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే లా డ్రైవర్లు/క్యాబ్‌లను నిర్వాహకులు ఏర్పాటు చేయాలి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటాయి. డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు అవుతాయి. కార్యక్రమం జరిగే చోటకు ఎలాంటి ఆయుధాలు అనుమతించ వద్దని ఆనంద్‌ పేర్కొన్నారు.  

>
మరిన్ని వార్తలు