అమెరికా టూ ఇండియా!.. తక్కువ ధరకే విమాన టికెట్‌.. నమ్మితే అంతే!

1 Dec, 2022 08:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పండుగలు, సెలవుల నేపథ్యంలో స్వదేశానికి వచ్చే వారిని టార్గెట్‌ చేస్తూ విమాన టికెట్‌ల రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు. అమెరికా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వారిని ఎంచుకుని వారి నుంచి రూ.లక్షలు కాజేస్తున్నారు. ఇటీవల యూఎస్‌లో ఉంటూ నగరానికి రావాల్సిన సుమారు 8 కుటుంబాలు సైబర్‌కేటుగాళ్ల చేతిలో మోసపోయి బంధువుల ద్వారా సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఈ విమాన టికెట్‌ల రూపంలో జరుగుతున్న మోసాలు సైబర్‌క్రైం పోలీసుల దృష్టికి వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులకు ముందే డబ్బు ఇస్తున్నారు. ఏజెంట్‌ ద్వారా టికెట్‌ను బుక్‌ చేయించి ఆ వివరాలు ప్రయాణికుడికి ఇస్తుండటంతో నమ్మకం మరింత రెట్టింపు అవుతుంది. తీరా ప్రయాణం రేపు అనగా..పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ చెక్‌ చేస్తే కాని తాము మోసపోయినట్లు తెలియడం లేదు. 

వాట్సాప్‌ గ్రూపుల్లోకి చొరబడి 
స్వదేశానికి వచ్చే వారిని కనిపెట్టిన బిహార్, రాజస్థాన్, యూపీకి చెందిన కొందరు సైబర్‌ నేరగాళ్లు యూఎస్‌లో ఉంటున్న భారతీయుల వాట్సాప్‌ గ్రూపుల్లోకి తెలిసిన వారి ద్వారా యాడ్‌ అవుతున్నారు. ట్రావెల్‌ ఏజెంట్‌ను అంటూ పరిచయం చేసుకోవడం, తన ద్వారా విమాన టికెట్‌లు బుక్‌ చేస్తే 40శాతం నుంచి 60శాతం డిస్కౌంట్‌ వస్తుందని చెబుతున్నారు. నమ్మకం కోసం తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి రూ.50వేలకే టికెట్‌ను ఇస్తున్నారు. ఆ టికెట్‌ను వాట్సప్‌ గ్రూపులో చూసిన వారంతా తమకు కూడా కావాలంటూ కేటుగాళ్లను సంప్రదిస్తున్నారు.

వీరు టికెట్‌ను ప్రయాణికులకు కావాల్సిన తేదీల్లో బ్లాక్‌ చేస్తూ ఆ వివరాలను పంపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఎస్సార్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం వారి చేతిలో మోసపోయింది. దీంతో నగరంలో ఉంటున్న సమీప బంధువుకు చెప్పడంతో అతను సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ బావ నుంచి రూ.10లక్షలు చేశారంటూ పోలీసుల ఎదుట వాపోయాడు. ఇదే తరహాలో పలు కుటుంబాలు రూ.25లక్షల నుంచి రూ.40లక్షల మేర నష్టపోయినట్లు సైబర్‌ క్రైం అందిన ఫిర్యాదుల ఆధారంగా స్పష్టమవుతోంది.     

ఆశపడి మోస పోవద్దు.. 
యూఎస్‌ నుంచి ఇండియాకు అంత తక్కువ రేటుకు టికెట్‌ రాదు. ఇండియాకు వచ్చేవారైనా, ఇతర దేశాలకు వెళ్లే వారైనా వారి మాటలు నమ్మి మోసపోవద్దు. ఎయిర్‌వేస్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే టికెట్‌ను బుక్‌ చేసుకునేందుకు ప్రయతి్నంచండి. అక్కడ జర్నీ తేదీని బట్టి టికెట్‌ ధర మారుతూ ఉంటుంది. 5–10శాతం మించి డిస్కౌంట్‌ ఎవరూ ఎక్కువగా ఇవ్వరు, ఒకవేళ ఇస్తామన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి, ఇతరులను సంప్రదించి మాత్రమే టికెట్‌ బుక్‌ చేసుకోండి. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు. 
– కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్‌క్రైం ఏసీపీ  

మరిన్ని వార్తలు