కస్టమర్‌ కేర్‌ కాదు.. ఖాతా కొల్లగొట్టుడే! 

26 Oct, 2020 09:08 IST|Sakshi

నకిలీ నంబర్లు గూగుల్‌లో నిక్షిప్తం చేసి మరీ చీటింగ్‌ 

సైబర్‌ నేరగాళ్ల నయా పంథాతో మోసపోతున్న జనం 

సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌కు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులు 

ప్రజలే అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసుల సూచనలు

సాక్షి, హైదరాబాద్‌: గూగుల్‌లో మీరు ఏదైనా సంస్థకు సంబంధించిన కస్టమర్‌ కేర్‌ సర్వీసు నంబర్‌ వెతుకుతున్నారా...అందులో లభించిన ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేస్తున్నారా...ఇంతవరకు ఓకే.. అయితే ఆ నంబర్‌ను రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి మీ బ్యాంక్‌ ఖాతా వివరాలు అడుగుతున్నా..  లేదా ఏనీ డెస్క్‌ యాప్‌ను మీ సెల్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సలహా ఇచ్చినా... అతడు సైబర్‌ నేరగాడు అని నిర్ధారించుకోవాలి. ఇంకోవైపు మేం పంపించే లింక్‌ను ఓపెన్‌ చేసి వివరాలు పొందుపర్చమన్నా కూడా అది సైబర్‌ నేరం జరగబోయేందుకు చిహ్నమని గుర్తుపెట్టుకోవాలి.

కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలయ్యాక ఆన్‌లైన్‌ లావాదేవీలు ఎక్కువగాజరుగుతుండటంతో ఏదో ఒక రకంగా కూర్చున్న చోటి నుంచే  డబ్బులు కొట్టేసే ప్రణాళికను సైబర్‌ నేరగాళ్లు అమలు చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటివరకు గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ సర్వీసు పేరుతో నకిలీ ఫోన్‌ నంబర్లు పెట్టి మరీ ఖాతాదారుల డబ్బును లాగేస్తున్నారు. దీంతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఈ సైబర్‌ నేరంపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి.   (అన్న కొడుకుతో ప్రేమ వ్యవహారం.. మందలించడంతో)

మచ్చుకు ఓ కేసు.. 
దుండిగల్‌కు చెందిన ఓ వ్యక్తికి రాపిపే ఫిన్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో డబ్బులు లావాదేవీలు చేసే వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 3న ఓ కస్టమర్‌ వచ్చి డబ్బులు డ్రా చేయమని అడిగితే అది విజయవంతం కాలేదు. దీంతో సాంకేతిక సహాయం కోసం గూగుల్‌లో సదరు సంస్థ కస్టమర్‌ కేర్‌ సర్వీసు నంబర్‌ కోసం శోధించాడు. అయితే కొన్ని గంటల తర్వాత కస్టమర్‌ కేర్‌ సర్వీసు అంటూ ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. లావాదేవీలు జరగడం లేదు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పడంతో ఏనీ డెస్క్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని సూచించాడు. అయితే తర్వాత రోజూ తన బ్యాంక్‌ ఖాతా నుంచి ఇతర బ్యాంక్‌ ఖాతాకు రూ.70 వేలు బదిలీ అయినట్టుగా సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు ఈ నెల 19న సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అప్రమత్తంగా ఉండండి... 
గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌లు శోధించవద్దు. బ్యాంక్‌ ఖాతాకు అనుసంధానించిన సెల్‌ఫోన్‌ నంబర్‌ కాకుండా ఇతర నంబర్‌ను కాలింగ్‌ కోసం ఉపయోగించాలి. అయితే తాము నిర్వహిస్తున్న సంస్థకు సంబంధించి సాంకేతిక ఇబ్బందుల ఎదురైతే కస్టమర్‌ సర్వీసుతో చాట్‌ చేసి క్లియర్‌ చేసుకోవాలి. బ్యాంక్‌ ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ షేర్‌ చేయవద్దు. పరిచయం లేని వ్యక్తులు చెప్పిన మాటలతో కంప్యూటర్‌లో గానీ, సెల్‌ఫోన్‌లో గానీ రిమోట్‌ యాక్సెస్‌ అప్లికేషన్లను నిక్షిప్తం చేసుకోవద్దు.     – వీసీ సజ్జనార్, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌  

మరిన్ని వార్తలు