ద్యావుడా.. వీళ్ళు వాట్సాప్‌ని వదలట్లేదుగా

19 Aug, 2021 07:49 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్: ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ వాట్సాప్‌ను సైబర్‌ నేరగాళ్లు వదలట్లేదు. ఓ నంబర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుని దాని ఆధారంగా కాంటాక్ట్స్‌ లిస్ట్‌ను సంగ్రహిస్తున్నారు. అందులో ఉన్న వారికి హ్యాకింగ్‌ లింకు పంపి హ్యాక్‌ చేస్తున్నారు. వారికి సందేశాలు పంపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. నగరంలో గడిచిన మూడ్రోజుల్లో నలుగురు బాధితులుగా మారారు. రూ.4 లక్షలు కోల్పోయిన వీళ్లు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మూడు కేసులు నమోదు చేసినట్లు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ చెప్పారు.   
సాధారణంగా ఎవరైనా ఒక స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను వాడుతూ... మరో ఫోన్‌లోకి మారితే.. ఓటీపీని పొంది ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దీన్ని తమకు అనువుగా మార్చుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు కొన్ని నంబర్లతో వాట్సాప్‌ యాక్టివ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  
►  దీనికి సంబంధించిన ఓటీపీ అసలు యజమానికి వెళ్తుంది. రకరకాల పేర్లతో సంప్రదించి బురిడీ కొట్టిస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఓ లావాదేవీలో పొరపాటున మీ ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేశానని, దీంతో ఓటీపీ మీకు వచ్చిందని చెప్పి వారి నుంచి తీసుకుంటున్నారు.  
►  ఇలా ఓటీపీని చేజిక్కించుకుని తమ ఫోన్లలో వారి నంబర్‌తో వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసుకుంటున్నారు. ఆ వెంటనే వారి వాట్సాప్‌ డీపీని కాపీ చేసి తమ దానికి పెట్టేస్తున్నారు. దీంతో పాటు సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను మార్చేస్తూ టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ చేస్తున్నారు. 

దీని వల్ల అసలు వ్యక్తి ఈ విషయం గుర్తించి తన ఫోన్‌లో వాట్సాప్‌ను మరోసారి యాక్టివేట్‌ చేసుకోవాలని భావించినా.. అది సాధ్యం కాదు. ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది నంబర్లు సైబర్‌ నేరగాళ్లు తమ అధీనంలోకి తీసుకుంటున్నారు.  
►  వాట్సాప్‌ బ్యాకప్‌ డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా వారి కాంటాక్ట్స్‌తో పాటు చాటింగ్స్‌ను తమ ఫోన్‌లోని వచ్చేలా చేస్తున్నారు. ఆపై ఆ కాంటాక్ట్స్‌లో కొందరికి అత్యవసరంగా డబ్బు కావాలంటూ సందేశాలు పంపుతూ, మరికొందరికి హ్యాకింగ్‌ లింకులు సెండ్‌ చేస్తున్నారు. 
►  తమ స్నేహితులు/బంధువుల నుంచే ఆ సందేశం వచ్చిందని భావిస్తున్నారు. కొందరు డబ్బు చెల్లిస్తుండగా.. మరికొందరు లింకుల్ని ఓ పెన్‌ చేసి తమ వాట్సాప్‌ కూడా హ్యాక్‌ అవడానికి కారకులు అవుతున్నారు. ఇలా వీరి కాంటాక్ట్స్‌లోని వారికీ సైబర్‌ నేరగాళ్లు సందేశాలు పంపుతూ తమ పని పూర్తి చేసుకుంటున్నారు.  

బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన కుమార్‌కు అతడి స్నేహితుడి నంబర్‌ నుంచి సోమవారం రూ.1.5 లక్షలు కావాలని సందేశం వచ్చింది. రూ.లక్ష బదిలీ చేసిన ఆయన మిగిలిన రూ.50 వేలు సర్దుబాటు కావవట్లేదని చెప్పడానికి మామూలు కాల్‌ చేశారు. దీంతో అసలు విషయం తెలిసి సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. 
►  ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ సమీపంలోని వీఎస్టీకి చెందిన ఓ అధికారి నంబర్‌ను సైబర్‌ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీని నుంచి అందులో పని చేసే ఉద్యోగులకు డబ్బు కావాలంటూ మంగళవారం సందేశాలు పంపారు. అప్రమత్తమైన వాళ్లు సదరు అధికారి దృష్టికి విషయం తీసుకువెళ్లడంతో ఆయన సైబర్‌ కాప్స్‌ను ఆశ్రయించారు.
►  పాతబస్తీకి చెందిన ఇద్దరు బాధితులకు వారి బంధువుల నంబర్‌ నుంచి ఇలానే సందేశాలు వచ్చాయి. నిజమైనవే అని భావించిన వాళ్లు రూ.1.5 లక్షల చొప్పున బదిలీ చేశారు. ఆపై అసలు విషయం తెలుసుకుని బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు