వ్యక్తిగత చిత్రాలు.. వీడియోలొద్దు   

26 Aug, 2020 08:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్‌.. నా పేరు వినీత(పోలీసులు పేరు మార్చారు).. నేను అడ్వకేట్‌గా విధులు నిర్వహిస్తున్నా. నా సెల్‌ నంబర్‌తో పాటు నా ఫేస్‌బుక్‌లోని ఫొటోలను సేకరించి అసభ్యకర చిత్రాలకు నా ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి పోర్న్‌ వెబ్‌సైట్‌లో పెట్టారు. తొలుత నగ్న వీడియోలు, చిత్రాలు పంపాలని ఫేస్‌బుక్‌ ఆధారంగా సేకరించిన నా సెల్‌ నంబర్‌కు ఫోన్‌కాల్‌ చేస్తే స్పందించలేదు. ఆ తర్వాత నా వివరాలు పోర్న్‌ సైట్‌లో నిక్షిప్తం చేయడంతో అపరిచితుల నుంచి ఫోన్‌కాల్స్‌ తాకిడి పెరిగింది. పెళ్లి కావాంటే ఇబ్బందులొస్తున్నాయి. నన్ను వేధించిన అతగాడిపై చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారితో వినీత అన్నమాటలివి. ఇలాంటి ఇబ్బందులు వినీతకే పరిమితం కాలేదు. పదుల సంఖ్యలో విద్యార్థినులు, యువతులు, మహిళలకు, వృత్తి నిపుణులకు ఎదురవుతున్నాయి. వీటిని విశ్లేషించిన పోలీస్‌ అధికారులు అపరిచితులు పంపిన చిత్రాలు, పోస్ట్‌లకు స్పందించవద్దని సూచిస్తున్నారు. 

ఆ ఖాతాలతో ప్రమాదం:
ఫేస్‌బుక్‌ ఖాతాలతోనే విద్యార్థినులు, యువతులు, మహిళలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని సైబర్‌ క్రైమ్‌ అధికారులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన చిత్రాలు, పోస్టులకు ‘లైక్‌’ కొట్టడం ద్వారా ఈ ప్రమాదాలు పరిచయం అవుతున్నాయని వివరిస్తున్నారు. ఎప్పుడో స్నేహితులతో గడిపిన సందర్భాలు, దేవాలయాలు, సినిమా థియేటర్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో సైబర్‌ నేరగాళ్లు వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇందులో చాలామంది విద్యార్థినులు పెళ్లికి ముందు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతాల్లోకి ప్రవేశిస్తున్న నిందితులు, నేరగాళ్లు.. యువతులు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతూ హెచ్చరికలు చేస్తున్నారు. నిందితుల్లో బాధితులకు తెలిసిన వారు, అపరిచితులు ఉంటున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఖాతాలున్న యువతులు, విద్యార్థినుల వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను వీడియోలను నేరగాళ్లు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు.

వారిలో స్నేహితులు, బంధువలే అధికం  
ఫేస్‌బుక్‌ ద్వారా వేధింపులు.. బెదిరింపులు.. హెచ్చరికలు చేస్తున్న వారిలో ఎక్కువ మంది యువతులు, విద్యార్థినుల స్నేహితులు, బంధువులే.. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు ఈ వివరాలు వెల్లడవుతున్నాయి. సామాజిక నెట్‌వర్క్‌ ఫేస్‌బుక్‌లో ఖాతాలున్న యువతులు, విద్యార్థినుల వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీటిని నేరగాళ్లు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెబుతున్నారు. యువతులు, విద్యార్థినులు.. ఇష్టం లేదని చెప్పినా వేధింపులు ప్రారంభిస్తున్నారు. స్నేహితులు.. కదా అని వారితో ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్తే ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో ఉంచుతున్నారు. తల్లిదండ్రులకు చెబితే కొడతారన్న భయంతో బాధితులు మిన్నకుండి పోతున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ వైద్య నిపుణుడికి ఫోన్‌ చేసి ‘నువ్వు, నీ భార్య కలిసున్న చిత్రాలు, వీడియోలు అశ్లీల వెబ్‌సైట్‌లో ఉంచుతాం’ అంటూ బెదిరించారు. ఆయన స్పందించక పోవడంతో ఆయన భార్య చిత్రాలను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. 

వ్యక్తిగత చిత్రాలు.. వీడియోలొద్దు   
ఫిర్యాదుల్లో బాధితులు చాలామంది తమ ఫేస్‌బుక్, య్యూటూబ్‌లోని వీడియోలు, ఫొటోల్లోని కొన్ని మార్ఫింగ్‌ చేశారని అంటున్నారు. మేం పరిశీలిస్తే 40 శాతం వరకూ అలాంటివే.. అందుకే బాధితులు, విద్యార్థినులు, యువతులు.. పార్టీలు, వేడుకలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బంధువులు, స్నేహితులతో గడిపేటప్పుడు హద్దుల్లో ఉండండి. అపరిచితులతో ఫంక్షన్లకు వెళ్లడం, సినిమాలు, పార్టీలకు హాజరు కావడం వంటివి చేస్తే ఇబ్బందుల్లో పడతామని గ్రహించండి. తల్లిదండ్రులకు అన్ని విషయాలు చెబితే ప్రాథమిక స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు. – రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ  

మరిన్ని వార్తలు