సిటీ కంపెనీలకు ‘హిడెన్‌బర్గ్‌ బూచి’ 

25 Feb, 2023 02:58 IST|Sakshi

ఆడిటింగ్‌ కంపెనీల పేరుతో ఈ–మెయిల్స్‌ 

అవకతవకలు గుర్తించామంటూ బెదిరింపులు 

సాక్షి, సిటీబ్యూరో: ‘హిడెన్‌బర్గ్‌–అదానీ గ్రూప్‌’ ఎపిసోడ్‌ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇటీవల సైబర్‌ నేరగాళ్లు ఈ తరహా కార్పొరేట్‌ బెదిరింపులకు దిగుతున్నారు. బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన ఓ సంస్థ శుక్రవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థకు రూ.వేల కోట్ల టర్నోవర్, దేశ వ్యాప్తంగా క్లయింట్స్‌ ఉన్నారు.

దీని అధికారిక ఐడీకి ఈ నెల మొదటి వారంలో ఓ ఈ–మెయిల్‌ వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆడిట్‌ కంపెనీ పంపినట్లు అందులో ఉంది. అందులో అనేక అవకతవకలకు పాల్పడుతూ, రికార్డులను తారుమారు చేయడంతోనే మీ సంస్థకు ఇంత మొత్తం టర్నోవర్‌ ఉన్నట్లు తమకు తెలిసిందని బెదిరించారు. ఈ విషయం తాము సుదీర్ఘ పరిశోధన తర్వాత గుర్తించామని రాశారు. కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కంపెనీ నిర్వాహకుల వివరాలతో పాటు ఫైనాన్స్‌ స్టేట్‌మెంట్స్‌ తమకు పంపాలని మెయిల్‌లో కోరారు.

ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తక్షణం తమకు 75 వేల డాలర్లు బిట్‌ కాయిన్స్‌ రూపంలో బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. తమ సంస్థకు సంబంధించిన సమస్త సమాచారం పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉండటం, ప్రముఖ ఆడిటింగ్‌ కంపెనీగా చెప్తున్న వారికి ఈ విషయం తెలియకపోవడంతో అనుమానించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

మరో పక్షం రోజుల తర్వాత అదే ఐడీ నుంచి వీరికి మరో ఈ–మెయిల్‌ వచ్చింది. అందులో డిమాండ్‌ చేసిన మొత్తం లక్ష డాలర్లు పెరిగిపోయింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న నిర్వాహకులు సొంత ఐటీ టీమ్‌తో ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఈ నేపథ్యంలో దాన్ని బెంగళూరుకు చెందిన సైబర్‌ నేరగాళ్లు అమెరికా సర్వర్‌ను వాడి పంపినట్లు తేల్చారు. దీంతో సదరు సంస్థ జనరల్‌ మేనేజర్‌ శుక్రవారం సిటీ సైబర్‌ కైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.   

మరిన్ని వార్తలు