ఫేస్‌బుక్‌లో ఫేక్‌ ప్రొఫైల్స్‌! 

10 Sep, 2020 09:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌ కేంద్రంగా సైబర్‌ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఓపక్క పోలీసు అధికారుల్ని, మరోపక్క సాధారణ ప్రజల్ని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. అప్పటికే ఫేస్‌బుక్‌ ఖాతాలు ఉన్న వారి ఫొటోలు, పేర్లు వినియోగించి కొత్త ఖాతాలు తెరుస్తున్నారు. వీటి ఆధారంగా ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపి, చాటింగ్‌ చేసి, డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్లలో ఉన్న అధికారులతో పాటు డీజీపీ కార్యాలయంలో పని చేసే వారి పేరుతోనూ ఈ నకిలీ ఖాతాలు తెరుచుకున్నాయి. తాజాగా బాధితులుగా మారిన ముగ్గురు సామాన్య ప్రజలు బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరహా నేరాలు చేయడానికి తెగబడుతున్న సైబర్‌ నేరగాళ్ళు ప్రాథమికంగా ఫేస్‌బుక్‌లోకి ప్రవేశిస్తున్నారు. వీలున్నన్ని ఖాతాల వివరాలు సెర్చ్‌ చేసి ప్రైవసీ సెట్టింగ్స్‌ లేని వాటిని గుర్తిస్తున్నారు. ఆ ఖాతాల్లో ఉన్న ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు.

ఆపై ఆ వారి ప్రొఫైల్‌ నేమ్‌లు, డౌన్‌లోడ్‌ చేసిన ఫొటోలను వినియోగించి నకిలీ ఖాతాలు సృషిష్టిస్తున్నారు. ఈ కొత్త ఖాతాల నుంచి ఆయా అసలు ఖాతాదారుల ఫ్రెండ్స్‌ లిస్టులో ఉన్న వారికే మళ్ళీ ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపిస్తున్నారు. వీటిని చూస్తున్న ఎదుటి వ్యక్తులు ఆయా తమ ఫ్రెండ్సే అనివార్య కారణాలతో మరో ఖాతా తెరిచి ఉంటారని భావించి యాక్సెప్ట్‌ చేస్తున్నారు. ఇది మొదటి ఘట్టం పూర్తయిన తర్వాత ఆ నకిలీ ఖాతాలు వినియోగించి కొన్నాళ్ళు ‘కొత్త ఫ్రెండ్స్‌’తో చాటింగ్‌ చేస్తున్నారు. ఆపై తమకు అత్యవసరం ఉందంటూ ఈ నకిలీ ఖాతాల నుంచి అసలు వ్యక్తుల ఫ్రెండ్స్‌కు సందేశం పంపిస్తున్నారు. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పంపాలని, కొన్ని గంటల్లోనే తిరిగి ఇచ్చేస్తానంటూ ఈ–వాలెట్స్‌లోని బదిలీ చేయాలంటున్నారు. అయితే అనేక మంది ‘స్నేహితులు’ మాత్రం నకిలీ ఖాతా నుంచి డబ్బు ప్రస్తావన వచ్చిన వెంటనే అసలు వ్యక్తుల్ని సంప్రదించి అప్రమత్తం చేస్తున్నారు.

ఇలా బుధవారం ముగ్గురు నగవాసులకు తమ పేరులో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు ఉన్నట్లు, వాటి ద్వారా డబ్బు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో వీళ్ళు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. మరోపక్క పోలీసు విభాగంలో పని చేస్తున్న అనేకమంది అధికారులు, సిబ్బంది పేర్లతో నకిలీ ఖాతాల సృష్టి ఆగలేదు. ఓ పక్క బాధ్యుల్ని పట్టుకోవడానికి ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. మరోపక్క ఆయా అధికారులు, పోలీసు విభాగాలు ఈ క్రైమ్‌పై అవగాహన కల్పించడానికి సోషల్‌మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు