‘పబ్లిక్‌ వైఫై’ వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త..!

9 Jan, 2023 01:13 IST|Sakshi

ఆన్‌లైన్‌లో పాస్‌వర్డ్, వ్యక్తిగత సమాచారం కొట్టేసేందుకు పొంచి ఉంటున్న సైబర్‌ నేరగాళ్లు

తప్పనిసరైతే వీపీఎన్‌ వాడాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల సూచన

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పుడంతా ఇంటర్నెట్‌ జమానా...నెట్‌తో కనెక్ట్‌ కాకుండా క్షణం ఉండలేని పరిస్థితి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ మొదలు..ఆఫీస్‌కు ఇన్ఫర్మేషన్‌ పంపే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా..ఇంటర్నెట్‌ సదుపాయం తప్పనిసరి. కొన్ని సార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట అనుకోని పరిస్థితుల్లో మన ఫోన్‌లో నెట్‌ బ్యాలెన్స్‌ లేనప్పుడు ఫ్రీ వైఫైల వైపు చూడడం పరిపాటే.. అయితే ఇకపై పబ్లిక్‌ వైఫైలు వాడుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తు­న్నారు.

పబ్లిక్‌ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి మనం ఈ మెయిల్, ఇతర సోషల్‌ మీడియా ఖాతాలు ఓపెన్‌ చేయడం,, ఆన్‌లైన్‌ బ్యాంక్‌ లావాదేవీలు చేస్తే మనం నమోదు చేసే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ ద్వారా హ్యాక్‌ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పబ్లిక్‌ ప్రాంతాల్లోని వైఫై వాడినట్లయితే సైబర్‌ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారం సైతం కొట్టేసే ప్రమాదం ఉంటుందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పబ్లిక్‌ వైఫై వాడకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో అయితే నమ్మదగిన వీపీఎన్‌(వర్చువల్‌ ప్రైవేటు నెట్‌వర్క్‌)ను ముందుగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటున్నారు. వీపీఎన్‌ ఉండడం వల్ల మన ఫోన్‌లోని సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తపడొచ్చని సూచిస్తున్నారు.  

మరిన్ని వార్తలు