హాస్టళ్లలో భద్రత కట్టుదిట్టం చేయాలి 

26 Feb, 2023 04:51 IST|Sakshi
మాట్లాడుతున్న సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర    

సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర 

గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో కొనసాగుతున్న వర్కింగ్‌ పీజీ హాస్టళ్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర హాస్టళ్ల నిర్వాహకులు, పోలీసులకు సూచించారు. శనివారం గచ్చిబౌలిలోని టీసీఎస్‌ క్యాంపస్‌లో నిర్వహించిన ‘ప్రాజెక్ట్‌ సేఫ్‌ స్టే’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీ హాస్టల్స్‌లో ఉంటున్న వారికి భద్రత కల్పించడం నిర్వాహకుల బాధ్యత అన్నారు. 24 గంటలు పని చేసేలా హాస్టల్‌ ఎగ్జిట్, ఎంట్రీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కాంపౌండ్‌ వాల్‌ ఐదు అడుగులు ఉండాలని, వాచ్‌మెన్‌లను నియమించాలన్నారు.

విజిటర్స్‌ వివరాలపై రిజిస్టర్‌ నమోదు చేయాలన్నారు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించాలని, నోటీసు బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సజేషన్స్‌ బాక్స్, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్, వ్యక్తిగత లాకర్ల సదుపాయం ఉండాలన్నారు. స్టాఫ్‌ ఐడీ ప్రూఫ్‌లతో పాటు కొత్తగా వచ్చే వారి ఐడీ ప్రూఫ్‌లు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిబంధనలు అతిక్రమిస్తే రూ.ఐదు వేల జరిమానా లేదా సీజ్‌ చేస్తామన్నారు. అనంతరం ప్రాజెక్ట్‌ సేఫ్‌ స్టే పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీలు కవిత, శిల్పవల్లీ, ఎస్‌సీఎస్‌సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, మహిళా ఫోరం జాయింట్‌ సెక్రటరీ ప్రత్యూష, ట్రాఫిక్‌ ఫోరం కార్యదర్శి శ్రీనివాస్, ఐటీ కారిడార్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పి.అమరనాథ్‌ రెడ్డి, ప్రదాన కార్యదర్శి కరుణాకర్, కోశాధికారి రఘు నాయుడు, గౌరవ అధ్యక్షులు చంద్ర శేఖర్, సంజయ్‌ చౌదరీ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు