ఐటీ ఆఫీసుల్లో ‘డ్రగ్స్‌’ నిఘా

6 Apr, 2022 03:25 IST|Sakshi

సైబరాబాద్‌ పోలీసుల ప్రత్యేక కార్యాచరణ 

డ్రగ్‌ ఫ్రీ వర్క్‌ ప్లేస్‌ నినాదంతో త్వరలో కమిటీల ఏర్పాటు 

సభ్యులుగా పోలీసులు, మేనేజ్‌మెంట్, ఉద్యోగులు, ఎన్‌జీఓ 

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను, ఉద్యోగుల భవితను కాపాడటమే లక్ష్యం 

ఈ నెలాఖరు నుంచి కార్యరూపం దాల్చనున్న కమిటీలు  

డ్రగ్స్‌పై ఫిర్యాదులు, సమాచారం కోసం డయల్‌ 94920 99100 

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు పలువురు డ్రగ్స్‌ సరఫరాదారులు, వినియోగదారులుగా మారుతున్న నేపథ్యంలో.. సైబరాబాద్‌ పోలీసులు దీనిపై దృష్టి సారించారు. డ్రగ్స్‌ కట్టడికి ప్రణాళిక రచించారు. క్షేత్రస్థాయిలో డ్రగ్స్‌కు డిమాండ్‌ను తగ్గిస్తే పై స్థాయిలో సరఫరా తగ్గుతుందని భావిస్తున్న సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర.. విద్యా, ఉద్యోగ సంస్థల్లో మాదకద్రవ్యాలు నియంత్రించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలోనే తొలిసారిగా విద్యా సంస్థలలో డ్రగ్స్‌ నిరోధక కమిటీలను ఏర్పాటు చేసిన సీపీ.. ఐటీ ఆఫీసుల్లోనూ ఈ దిశగా చర్యలకు సిద్ధమయ్యారు. 

మాదకద్రవ్యాల వైపు మొగ్గు చూపకుండా.. 
కరోనా ఆంక్షలు సడలించిన నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటివరకు వర్క్‌ఫ్రమ్‌ హోం చేసిన ఉద్యోగులు నగరానికి చేరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో, పని ఒత్తిడి, వీకెండ్‌ పార్టీలతో ఉద్యోగులెవరూ మాదకద్రవ్యాల వైపు మొగ్గుచూపకుండా నియంత్రించే ఉద్దేశంతో  ‘డ్రగ్స్‌ ఫ్రీ వర్క్‌ ప్లేస్‌’ (డ్రగ్స్‌కు తావులేని పని ప్రదేశం) నినాదంతో డ్రగ్స్‌ నిరోధక కమిటీలను పోలీసులు ఏర్పాటు చేయనున్నారు.

సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌లో చిన్న పెద్ద ఐటీ కంపెనీలు సుమారు వెయ్యి వరకు ఉంటాయి. వీటిలో దాదాపు 4 లక్షల మంది పురుష, 2.50 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఉంటారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న పని ప్రదేశాల్లో డ్రగ్స్‌ నిరోధక కమిటీలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌ ఐటీ బ్రాండ్‌కు మచ్చపడకుండా ఉంటుందని,  ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్తు మత్తుకు చిత్తుకాకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.  

కమిటీలో సభ్యులు ఎవరెవరు? 
డ్రగ్స్‌ నిరోధక కమిటీలో స్థానిక పోలీసులతో పాటు కంపెనీ మేనేజ్‌మెంట్, మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌), సెక్యూరిటీ, ఎంపిక చేసిన కొందరు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. త్వరలోనే కమిటీల విధివిధానాలను సైబరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసు ఉన్నతాధికారులు ఖరారు చేయనున్నారు. ఈనెలాఖరు నుంచి ఆయా కమిటీలు కార్యరూపంలోకి రానున్నాయి.

కమిటీలు ఏం చేస్తాయి? 
డ్రగ్స్‌ నిరోధక కమిటీలు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టిసారిస్తాయి. 

1. ఎవరైనా డ్రగ్స్‌ను ఆఫర్‌ చేస్తే ప్రలోభాలకు గురికాకుండా మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలో సూచనలు ఇస్తారు. ఆఫర్‌ చేసిన స్నేహితుడు, సహోద్యోగిని నొప్పించకుండా సున్నితంగా ఎలా తిరస్కరించాలో నేర్పిస్తారు. 
2. డ్రగ్స్‌కు అలవాటు పడినవారిని కమిటీలు గుర్తించినా లేదా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నవారు స్వచ్ఛందంగా కమిటీ ముందుకొచ్చినా.. వారు అలవాటును ఎలా మానుకోవాలో శిక్షణ ఇస్తారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఎన్‌జీవో, మానసిక నిపుణుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తారు. పూర్తిగా కోలుకునే వరకు పర్యవేక్షిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తారు. 
3. కంపెనీలు, విద్యా సంస్థలలో గుట్టుచప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న వారిపై కమిటీలు నిఘా పెడతాయి. విక్రయ, కొనుగోలుదారుల వివరాలను రహస్యంగా సేకరించి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. మేనేజ్‌మెంట్‌ తరఫున కూడా చర్యలు ఉంటాయి. 

150కి పైగా విద్యా సంస్థల్లో ఏర్పాటు 
రాష్ట్రంలోనే తొలిసారిగా మాదాపూర్‌ జోన్‌లో 150కి పైగా స్కూళ్లు, కాలేజీల్లో ఈ విధంగా డ్రగ్స్‌ నిరోధక కమిటీలను ఏర్పాటు చేశారు. త్వరలోనే శంషాబాద్, బాలానగర్‌ జోన్లలోని విద్యా సంస్థలలో కూడా ఏర్పాటు చేయనున్నారు. జూలై నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం అయ్యాక ఆయా కమిటీలు కార్యరూపంలోకి వస్తాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే హెచ్‌సీయూ, సీబీఐటీ, వీఎన్‌ఆర్‌ వంటి ప్రధాన విద్యా సంస్థల్లో సైబరాబాద్‌ కమిషనరేట్, మాదాపూర్‌ డివిజన్‌లోని పలువురు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించి ఫిర్యాదులు, సమాచారం కోసం 94920 99100 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు