యువతిగా మారాలని యువకుడి కోరిక.. చివరికి

2 Apr, 2021 09:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యువతిగా మారాలని పలుమార్లు అదృశ్యం

సైబరాబాద్‌ ట్రాన్స్‌జెండర్స్‌ డెస్క్‌కు ఫిర్యాదు

కౌన్సెలింగ్‌తో సమస్య పరిష్కరించిన అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: యువతిగా మారాలన్న తన కోరికను కుటుంబికులు అంగీకరించట్లేదనే ఉద్దేశంలో షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదేపదే ‘అదృశ్యం’ అవుతున్నాడు. ఎట్టకేలకు ఈ అంశం సైబరాబాద్‌ ట్రాన్స్‌జెండర్స్‌ హెల్ప్‌డెస్క్‌ వద్దకు వచ్చింది. అతడి ఆచూకీ కనిపెట్టిన అధికారులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అంతటితో ఆగకుండా కుటుంబికులకు కౌన్సెలింగ్‌ చేసి అతడి కోరిక తీరేలా చేశారు. గత నెల 6 నుంచి పని చేయడం ప్రారంభించిన ఈ డెస్క్‌కు మొత్తం ఏడు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు గురువారం వెల్లడించారు. అయిదుగురికి కౌన్సెలింగ్‌ చేయగా.. రెండు అంశాల్లో కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదో తరగతిలో ఉండగానే యువతిగా మారాలని భావించాడు. తన కోరికను తల్లిదండ్రులకు చెప్పగా వారు ససేమిరా అన్నారు. దీంతో ఇల్లు విడిచి పారిపోయిన అతగాడు ఎల్బీనగర్‌ ప్రాంతంలో ఉన్న ఓ ట్రాన్స్‌జెండర్స్‌ గ్రూప్‌లో చేరాడు. అప్పట్లో తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న షాద్‌నగర్‌ పోలీసులు అతడిని గుర్తించి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా గడిచిన కొన్నేళ్ల కాలంలో మూడు నాలుగుసార్లు జరిగింది. ఇటీవల మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయిన అతగాడు సిద్దిపేటకు చేరాడు. అతడి తల్లిదండ్రులు షాద్‌నగర్‌ పోలీసుల వద్దకు వెళ్లగా.. అక్కడి అధికారులు గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్స్‌ హెల్ప్‌ డెస్క్‌కు పంపారు. సబ్‌– ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో సాగుతున్న ఈ డెస్క్‌ వీరి నుంచి ఫిర్యాదు స్వీకరించింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించింది.

అతడు సిద్దిపేటలో ఉన్నట్లు గుర్తించి తీసుకువచ్చారు. యువతిగా మారాలన్న కోరిక తీరకపోతే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని తీవ్ర పరిణామాలకు ఆస్కారం ఉందంటూ తల్లిదండ్రులకు హెల్ప్‌ డెస్క్‌ కౌన్సెలింగ్‌ చేసింది. ఫలితంగా పరిస్థితులు అర్థం చేసుకున్న వాళ్లు తమ కుమారుడి కోరికను మన్నించారు. హెల్ప్‌ డెస్కే చొరవ తీసుకుని అతడికి ఓ ఉద్యోగం ఇప్పించింది. ఎలాంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడనంటూ ‘ఆమె’గా మారిన అతడి నుంచి హామీ తీసుకుని పంపింది. ట్రాన్స్‌జెండర్స్‌ అంశాలకు సంబంధించి సహాయ సహకారాలు కావాల్సిన వారు 94906 17121లో వాట్సాప్‌ ద్వారా (transgender.cybsuprt121@gmail.com) ఇన్‌స్టాగ్రామ్‌ (transgender cybsupport), ఫేస్‌బుక్‌ ‘Transgender Cyberabad Support) ఖాతాల్లో సంప్రదించాలని సైబరాబాద్‌ పోలీసులు సూచించారు. 

చదవండి: ట్రాన్స్‌జెండర్‌ వైద్యురాలికి కీలక పదవి

మరిన్ని వార్తలు