ఐటీ ‘రిటర్న్స్‌’ విషయంలో జర జాగ్రత్త..!

3 Sep, 2021 14:53 IST|Sakshi

బెనిఫిషియరీ ఖాతాలు మార్చేస్తూ నగదు స్వాహా

ఓ వ్యక్తికి రావాల్సిన రూ. 21 లక్షలు కాజేసిన నేరగాళ్లు

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయపన్ను శాఖ నుంచి పన్ను చెల్లింపుదారులకు తిరిగి రావాల్సిన మొత్తాలను సైబర్‌ నేరగాళ్లు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ చార్టెడ్‌ అకౌంటెంట్‌(సీఏ) గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది.(చదవండి: WhatsApp: ఎడిట్‌ ఫొటోల్ని, జిఫ్‌ ఫైల్స్‌ను పంపుతున్నారా?)

  • సిటీ కేంద్రంగా ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్న చార్టెడ్‌ అకౌంటెంట్‌కు దేశ వ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. వారిద్వారా మహారాష్ట్ర పుణేకు చెందిన ప్రవాస భారతీయుడు(ఎన్నారై) పరిచయమయ్యారు. కాలిఫోర్నియాలో ఉండే ఆయన తన ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయాలనడంతో సీఏ అంగీకరించారు.
  • ఎన్నారైకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రావాల్సిన రూ. 21 లక్షలను పుణేలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి పంపాలంటూ వాటిలో పొందుపరిచారు.
  • సదరు ఖాతా నంబర్‌ ఐటీ రికార్డుల్లోనూ ఉంది. నిర్ణీత గడువు ముగిసినా తనకు రావాల్సిన డబ్బు రాలేదని సీఏ దృష్టికి ఎన్నారై తీసుకెళ్లారు. సీఏ ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు.
  • పరిశీలించిన అధికారులు సదరు ఎన్నారైకి రావాల్సిన రూ. 21 లక్షలను కొన్ని నెలల క్రితమే చెల్లించామంటూ సమాధానం ఇచ్చారు. అవాక్కైన సీఏ ఆ డబ్బు పంపిన ఖాతా వివరాలు తెలపాల్సిందిగా ఐటీ కాల్‌ సెంటర్‌ను సంప్రదించారు.
  • వారందించిన వివరాల మేరకు విశాఖ పట్నం ద్వారకానగర్‌లోని ఇండస్‌ ఇండ్‌ బ్యాంకును సీఏ సంప్రదించారు. ఆ ఖాతాలోకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 21 లక్షలు జమయ్యాయని, ఆ మొత్తాన్ని ఖాతాదారుడు డ్రా చేసేసినట్లు బ్యాంకర్లు వెల్లడించారు. 
  • ఆ ఖాతాను సైబర్‌ నేరగాళ్లు కాలిఫోర్నియాలో ఎన్నారై పేరు, వివరాలతోనే ఓపెన్‌ చేసి.. ఆదాయపు పన్ను శాఖ రికార్డుల్లోకీ జొప్పించారు. ఫలితంగానే రిటర్న్స్‌కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ శాఖ అందులోకి బదిలీ చేసింది.
  • ‘చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఈ సైబర్‌ నేరానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు అందిస్తూ ఫిర్యాదు చేశారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు లిఖిత పూర్వకంగా కోరాం’ అని ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ వివరించారు. 
మరిన్ని వార్తలు