‘టౌటే’ అలజడి: చెట్టు కిందకు చేరి.. పిడుగుపాటుకు గురై..

17 May, 2021 02:21 IST|Sakshi

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు బలి

సాక్షి, నెట్‌వర్క్‌: టౌటే తుపాను ప్రభావంతో ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తడంతో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటుకు సూర్యాపేట జిల్లాలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. వర్షం, ఈదురుగాలులకు కొన్నిచోట్ల కోతకు వచ్చిన మామిడికాయలు నేలరాలాయి. పలు పంటలకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది.

చెట్టు కిందకు చేరి.. పిడుగుపాటుకు గురై..
సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. నూతనకల్‌ మండలం లింగంపల్లికి చెందిన భయ్యా వెంకన్న తన మిరపతోటలో కాయలు ఏరడానికి ఆదివారం పదిమంది కూలీలను తీసుకెళ్లాడు. వీరంతా మిరపకాయలు ఏరుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పక్కనే ఉన్న వేపచెట్టు కిందికి వెళ్లారు. చెట్టుపై పిడుగుపడటంతో కారింగుల ఉమ (36), వీరబోయిన భిక్షం (80) అక్కడికక్కడే  మృతి చెందారు. గాయపడిన పేర్ల నీలమ్మ, ఉప్పుల నాగమ్మ, భయ్యా లింగమ్మ, భయ్యా సిద్ధును సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించారు.

మరో ఘటనలో.. ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం మిడ్తనపల్లికి చెందిన బయ్య రాములమ్మ తన ముగ్గురు కుమారులు, కోడళ్లు, కూతురు, వారి పిల్లలతో కలిసి తమ మిరపతోటలో కాయలు ఏరుతుండగా ఉదయం 11 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడటంతో రాములమ్మ, ఆమె రెండో కోడలు లక్ష్మి తీవ్ర గాయాలై స్పృహతప్పి పడిపోయారు. వీరిని కుటుంబసభ్యులు సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు