ఏడాదికోసారైనా గుడికి రావాలని మా అమ్మ కోరింది

9 Oct, 2022 02:05 IST|Sakshi
చిన్నారితో ఫొటో దిగుతున్న నటుడు రానా 

ఆ దేవాలయం ‘స్మర్శ్‌’ హాస్పైస్‌ : నటుడు రానా

‘స్పర్శ్‌’లో పీడియాట్రిక్‌ పాలియేటివ్‌ కేర్‌ వార్డు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ఏటా ఒక్కసారైనా తనతోపాటు దేవాలయానికి రావాలని తల్లి కోరిందని, దీర్ఘకాలిక వ్యాధులతో జీవిత చరమాంకంలో ఉన్నవారికి ఉచితంగా ఉపశమన(హాస్పీస్‌–పాలియేటివ్‌ కేర్‌) సేవలను అందిస్తున్న స్పర్శ్‌ హాస్పైస్‌ సెంటరే ఆ దేవాలయమని సినీ నటుడు రానా తెలిపారు. వరల్డ్‌ హాస్పైస్‌ అండ్‌ పాలియే టివ్‌ కేర్‌ డే వేడుకలను గచ్చిబౌలిలోని స్పర్శ్‌ హాస్పైస్‌ అండ్‌ పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌లో శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పదేళ్లలోపు చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పది పడకల పీడియాట్రిక్‌ పాలియేటివ్‌ కేర్‌ వార్డును రానా ప్రారంభించారు. స్పర్శ్‌ బృందాన్ని, సహకారం అందిస్తున్న బంజారాహిల్స్‌ రోటరీ క్లబ్‌ సభ్యులకు అభినందనలు తెలిపారు. స్పర్శ్‌ కార్యక్రమాలకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానన్నారు. తల్లి స్పర్శను ప్రతిబింబించేలా నగరంలో సేవలు అందిస్తున్న స్పర్శ్‌ హాస్పైస్‌ కృషి అభినందనీయమని కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని అన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా స్పర్శ్‌ సౌకర్యాలు అందిస్తోందని రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ప్రశంసించారు.  

ప్రపంచ స్థాయి కేన్సర్‌ ఆసుపత్రిని ప్రారంభిస్తాం... 
చివరిదశ కేన్సర్‌తో బాధపడుతున్న పిల్లల కోసం రెయిన్‌బో హాస్పిటల్స్‌ సహకారంతో పీడియాట్రిక్‌ పాలియేటివ్‌ కేర్‌ వార్డును ప్రారంభించామని బంజారాహిల్స్‌ రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌ ధూళిపూడి తెలిపారు. శిక్షణ పొందిన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ఫిజియో థెరపిస్ట్‌లు, కౌన్సెలర్లు, ఆధ్యాత్మిక మార్గదర్శకుల బృందం సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు.

మహిళల్లో గర్భాశయ, రొమ్ము తదితర కేన్సర్లను గుర్తించడానికి నూతనంగా మొబైల్‌ కేన్సర్‌ స్క్రీనింగ్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచస్థాయి కేన్సర్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామని, ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 3 నుంచి 4 ఎకరాల భూమిని అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రెయిన్‌బో హాస్పిటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కంచర్ల రమేష్, స్పర్శ్‌ బృందం, రోటరీ క్లబ్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు