దళితబంధు అందరికీ ఇవ్వాలి 

15 Aug, 2021 02:43 IST|Sakshi
కందుగులలో రహదారిపై ఆందోళన చేస్తున్న దళితులు

హుజూరాబాద్, జమ్మికుంటల్లో దళితుల ఆందోళన 

అధికార పార్టీ వారికే పథకం వచ్చేలా చేస్తున్నారని ఆరోపణ 

పలుచోట్ల రాస్తారోకోలు.. 

కనగర్తిలో సీఎం దిష్టిబొమ్మ దహనం  

కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లకు ఫోన్‌ చేసి ఆరా తీసిన మంత్రి హరీశ్‌రావు 

హుజూరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, వరంగల్‌: దళితబంధు పథకానికి అనర్హులను ఎంపిక చేస్తున్నారని.. ఒకేసారి అందరికీ వర్తించేలా పథకాన్ని అమలు చేయాలని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితులు ఆందోళనలకు దిగారు. శనివారం పలుచోట్ల రహదారులపై బైఠాయించి రాస్తారోకోలు చేశారు. అధికార పార్టీకి చెందినవారికే పథకం వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. దీంతో హుజూరాబాద్‌ సహా పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనలు విరమింపజేశారు.   

హుజూరాబాద్‌ పట్టణంలో.. 
దళితులందరికీ ‘దళితబంధు’ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పోతిరెడ్డిపేట, ఇప్పల్‌నర్సింగాపూర్‌ గ్రామాలకు చెందిన దళితులు హుజూరాబాద్‌లోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందినవారు పరకాల క్రాస్‌రోడ్డు వద్ద.. కందుగుల గ్రామ ఎస్సీ కాలనీకి చెందినవారు పరకాల–హుజూరాబాద్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేశారు. అనర్హులను ‘దళితబంధు’ పథకానికి ఎంపిక చేశారని మండిపడ్డారు. వారిని ఏ అర్హత ప్రకారం ఎంపిక చేశారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్, జెడ్పీటీసీ బక్కారెడ్డి వచ్చి ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ దళితులు వెనక్కి తగ్గలేదు. అర్హులను వదిలేసి అనర్హులను ఏ విధంగా ఎంపిక చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఆందోళనతో హుజూరాబాద్‌ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చివరికి పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. 

జమ్మికుంట, ఇల్లందకుంటల్లోనూ.. 
ఇల్లందకుంట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట దళితులు నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వారికే పథ కం వచ్చేలా చేస్తున్నారంటూ తహసీల్దార్‌ సురేఖతో వాదన కు దిగారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఫోన్‌లో వారితో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. ఇక కనగర్తి గ్రామంలో దళితులు రోడ్డుపై బైఠాయించారు, సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లిలోనూ దళితులు ఆందోళన చేశారు. 

కలెక్టర్లకు మంత్రి హరీశ్‌రావు ఫోన్‌.. 
దళితుల ఆందోళనల నేపథ్యంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు కర్ణన్, రాజీవ్‌గాంధీ హనుమంతులతో ఫోన్‌లో మాట్లాడారు. పథకం కోసం ఎంపిక చేస్తున్న దళితుల వివరా లు, ప్రాధాన్యతలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా, అపోహలకు అవకాశం లేకుండా ఎంపిక ప్రక్రియ జరగాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు