‘వీహబ్‌’తోడుగా.. విజయం దిశగా..

19 Dec, 2022 03:08 IST|Sakshi

వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న దళిత మహిళలు

దళితబంధు లబ్ధిదారులకు అండగా వీహబ్‌

343 మంది మహిళల వ్యాపారాలకు తోడ్పాటు

అనువైన వ్యాపారం, మార్కెటింగ్‌ సహా అన్నింటా సాయం

హుజూరాబాద్‌ ప్రాంతంలో మంచి çఫలితమిచ్చిన ‘వీహబ్‌’ ప్రయత్నం

సాక్షి, హైదరాబాద్‌: వారు సాధారణ దళిత మహిళలు.. వ్యాపారం చేయాలన్న తపన ఉన్నా ఏం చేయాలనే స్పష్టత లేనివారు.. కానీ ఇప్పుడు వారు ఉపాధి పొందడమే­కాదు.. మరికొందరికి ఉపాధినిచ్చే దశకూ చేరు­కుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి­ష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’ ఆర్థికసాయం.. మహిళలు వ్యాపార, వాణి­జ్య­వేత్తలుగా ఎదిగేలా తోడ్పడేందుకు ఏర్పా­టైన ‘వీహబ్‌’ భాగస్వామ్యం.. కలిసి దీనిని సాకారం చేశాయి. కేవలం మూడు నెలల వ్యవధిలో హుజూరాబాద్‌ ప్రాంతంలో 343 మంది ఎస్సీ మహిళలు వీహబ్‌ తోడ్పాటుతో ఎంట్రప్రెన్యూర్లుగా ప్రస్థానం ప్రారంభించడం గమనార్హం. ఐదేళ్ల క్రితం ప్రారంభమై­న వీహబ్‌ ఇప్పటికే సుమారు 4 వేల మంది గ్రామీణ మహిళల్లో వ్యాపార దక్షత పెరిగేందుకు తోడ్పాటును అందించింది కూడా.

ప్రత్యేకంగా అవగాహన కల్పించి..
మహిళలను వ్యాపార­వేత్త­లుగా తీర్చిదిద్దేందు­కు వీహబ్‌ చేస్తున్న కృషిని గుర్తించిన అధి­కారులు.. హుజూరాబాద్‌లో దళితబంధు పథ­కం అమల్లో భాగ­స్వా­మ్యం కావా­ల్సింది­గా ఆహ్వా­నించారు. ఈ మేరకు రంగంలోకి దిగి­న వీహబ్‌.. మూడు నెలల పాటు దళిత­బంధు లబ్ధిదారులతో కలిసి పనిచేసింది. వారి అవసరాలు తెలుసుకో­వడంతో­పాటు ఉపాధి పొందడానికి అవస­రమైన తోడ్పాటు­ను అందించింది.

మొదట ఉపాధి మార్గం,దానిని ఆచరణలో పెట్టడా­నికి అవస­రమైన వనరులు తదితర అంశాలపై ఎంట్రప్రెన్యూ­ర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రో­గ్రా­మ్‌ను (ఈడీపీ) నిర్వహించింది. దళి­త­బంధు పథకం కింద స్థానికంగా అ­ధికా­రులు ఎంపికచేసిన 790 మంది లబ్ధి­దా­­రులు హాజరయ్యారు. అందులో 343మంది మహిళలు సొంతంగా ఉపాధి యూ­నిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపారు.

అన్ని అంశాల్లో తోడుగా..
మహిళల వ్యాపార ఆలోచన, దాని వెనుకుండే లాభనష్టాలు, ప్రాజెక్టు నివే­దిక తయారీ వంటి అంశాలపై వీహబ్‌ అవ­గాహన కల్పించింది. లబ్ధిదారులు కొత్త వ్యా­పారాన్ని ప్రా­రంభించేందుకు అవస­రమైన ఏడు అంశాలపై లోతుగా శిక్షణ ఇచ్చింది. వారికి అవసరమైన డాక్యుమెంట్లు, రిజిస్ట్రేష­¯­­] ్లు, లైసెన్సులు, యంత్రాల కొనుగోలుకు అమ్మకందారులతో పరిచ­యాలు, కొటేషన్లు, స్కీమ్‌ డబ్బులను అధికారులు విడుదల చేయ­డం దాకా తోడుగా నిలిచింది. దీంతో 343 మంది మహిళలు 3 నెలల వ్యవధిలోనే వ్యాపారాలను ప్రారంభించగలిగారు.

వారి తపన అభినందనీయం
తొలుత మేం దళితబంధు లబ్ధిదారులతో సమావేశమై వారి ఆలోచనలను తెలుసుకున్నాం. వాటిని ఆచరణలోకి ఎలా తేవాలనే దానిపై మార్గదర్శనం చేశాం. వారిలో పట్టుదలను నింపేందుకు ఇప్పటికే సక్సెస్‌ అయిన మహిళా ఎంట్రప్రెన్యూర్ల విజయగాథలను వీడియోల ద్వారా చూపించాం. దళిత మహిళలు లింగ, కుల, సామాజిక, ఆర్థిక అడ్డంకులను దాటుకుని ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు పడుతున్న తపన అభినందనీయం.
– దీప్తి రావుల, సీఈవో, వీహబ్‌

రెండు నెలల్లోనే సంపాదన మార్గంలోకి..
ఇంటర్‌ వరకు చదువుకున్న నేను పెళ్లయిన తర్వాత డిగ్రీ పూర్తి చేశా. హోమ్‌ ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాను. సొంతంగా వ్యాపారం చేయా­లనే ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. దళిత­­ ­బంధు కింద ఎంపిక కావడంతో ఏ వ్యాపారమైతే బాగుంటుందనేది తెలుసుకునేందుకు ఎన్నో ప్రాంతాలు తిరిగి, ఎంతో మందిని కలిశాను. నా భర్తకు డ్రైవింగ్‌ తెలుసు కాబట్టి కారు కొందామనుకున్నా. వీహబ్‌ ప్రతినిధులను కలిశాక స్పష్టతకు వచ్చా. వారి తోడ్పాటుతో కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీ, స్టేషనరీ షాప్‌ పెట్టి.. రెండు నెలల్లోనే నెలకు రూ.10వేలకుపైగా సంపాదించే దశకు చేరుకున్నా.    
– నీరటి మౌనిక, దళితబంధు లబ్ధిదారు

ఇప్పుడు ఉపాధి కల్పించే స్థితిలో ఉన్నా..
చాన్నాళ్లు ఇంటికే పరిమితమైన నేను ఇప్పుడు ఎంట్రప్రెన్యూర్‌గా మారాను. ఇంట్లోనే ఏర్పాటు చేసిన క్యారీబ్యాగ్స్‌ తయారీ యూనిట్‌తో నెలకు రూ.50వేల దాకా ఆదాయం వస్తోంది. నిజానికి దళితబంధు పథకానికి ఎంపికైన తర్వాత శారీ సెంటర్‌గానీ, కిరాణా దుకాణంగానీ ఏర్పాటు చేయాలనుకున్నాను. వీ హబ్‌ భేటీ తర్వాత చేతి సంచుల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాను. గతంలో ఉపాధి వెతుక్కునే దశ నుంచి ఇప్పుడు వేరేవాళ్లకు ఉపాధి కల్పించే దశకు చేరుకోవడం ఆనందాన్నిస్తోంది.
– వేల్పుల శారద, దళితబంధు లబ్ధిదారు, హుజూరాబాద్‌ 

మరిన్ని వార్తలు