కాస్త వేగం.. ఇంకాస్త నెమ్మది..! 

21 Jun, 2021 16:26 IST|Sakshi
నిర్మాణం చివరిదశలో ఉన్న దళిత్‌ స్టడీస్‌ భవనం

ఎస్పీఆర్‌ హిల్స్‌లో దళిత్‌ స్టడీస్‌ భవనం

రూ.21 కోట్ల వ్యయం.. 1400 గజాల విస్తీర్ణం.. 7 అంతస్తుల్లో నిర్మాణం

బౌద్ధ మతశైలిలో ధ్యాన కేంద్రం

ఆకర్షణగా నిలవనున్న అంబేడ్కర్‌ విగ్రహం

ఎట్టకేలకు తుది దశలో పనులు

హైదరాబాద్‌: దళిత విజ్ఞాన ధామం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ భవన నిర్మాణం పనులు రెండేళ్లుగా కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ విధింపు ఇతరత్రా కారణాలతో కొంత మేర ఆలస్యం జరిగినా మొత్తానికి తుది దశకు చేరుకున్నాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలోని రహమత్‌నగర్‌ ఎస్పీఆర్‌ హిల్స్‌లో 1400 గజాల విస్తీర్ణంలో రెండు సెల్లార్లతో పాటు 7 అంతస్తుల్లో దాదాపు 77,800 చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ.21 కోట్ల వ్యయంతో ఇట్టి భవనాన్ని నిర్మించ తలపెట్టారు. 

కాగా భవన నిర్మాణానికి 2016 ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేయగా, 2017 నవంబర్‌లో ప్రారంభమైన పనులు నెమ్మదిగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం పార్కింగ్‌ టైల్స్‌ నిర్మాణం జరుగుతుంది. చిన్నపాటి ప్యాచ్‌వర్క్‌లు పూర్తిచేసి త్వరలోనే భవనాన్ని అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. 

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో... 
ఎక్కువ భాగం స్టీల్‌తో కొంత మొత్తం సిమెంట్‌తో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానమైన ‘కాంపోజిట్‌ స్ట్రక్చర్‌’ పద్ధతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.  న్యూజిలాండ్‌కు చెందిన ‘ఎక్స్‌పాండెడ్‌ పాలిస్ట్రెయిన్‌ వాల్‌(ఈపీఎస్‌)’ టెక్నాలజీతో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్మాణం జరుపుకుంటుంది. పూర్తిస్థాయిలో స్టీల్‌ పిల్లర్లు నిర్మించి వాటిపై సిమెంట్‌తో స్లాబ్‌ వేస్తున్నారు. సాధారణ భవనాల నిర్మాణంతో పోలిస్తే నిర్మాణ వ్యయం తగ్గుతుంది. ఈ భవనంలో కనీసం నాలుగైదు డిగ్రీల వేడి త క్కువగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక బౌద్ధ సాంప్రదాయ ఉట్టిపడేలా ముద్రలు, స్థూపాలు ఏర్పాటు చేస్తున్నారు. 

సెంటర్‌ ఏర్పాటు లక్ష్యం..? 
దళిత స్టడీస్‌ ఏర్పాటు ప్రధాన లక్ష్యం చిరకాలంగా దళితులు, ఆదివాసీలు, ఇతర వెనబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సమస్యలను గుర్తించడం. వాటికి సమర్దవంతమైన పరిష్కారాలపై పరిశోధన చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేయడం ద్వారా పాలసీ స్థాయిలో పటిష్టమైన కృషి చేయడం. వివిధ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లపై, సామాజిక సమస్యల పరిష్కారంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం. 

ఒక్కో అంతస్తులో ఇవి... 
ఏడు అంతస్తులుగా నిర్మించే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ భవనంలో ప్రతి అంతస్తులో ఒక్కో విభాగాన్ని ఏర్పాటు చేయ తలపెట్టారు. 
మొదటి అంతస్తులో డైనింగ్, కాఫీ షాప్‌. 
రెండో అంతస్తులో ధ్యాన గది, బోర్డ్‌రూమ్, సమావేశమందిరం. 
మూడో అంతస్తులో లైబ్రరీ, డిజిటల్‌ ల్యాబ్, మీడియా గది. 
నాల్గవ అంతస్తులో శిక్షణకు వచ్చే వారికి వసతి. 
ఐదో అంతస్తులో ఆడిటోరియం. 
ఆరో అంతస్తులో మ్యూజియం.
మిగిలిన అంతస్తుల్లో దళితులతో సహ ఆర్థికంగా వెనకబడినవారి సమస్యలపై «పరిశోధన కేంద్రం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. 
భవనం పైకప్పుపై బౌద్ధ మతశైలిలో డోమ్‌తో కూడిన విశాలమైన ధ్యాన కేంద్రం నిర్మిస్తున్నారు.  
ప్రత్యేక ఆకర్షణగా అంబేడ్కర్‌ విగ్రహం.. 
భవనం ముందుభాగంలో మూడో అంతస్తుపై 25 అడుగుల పొడవైన అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని పూర్తి ఫైబర్‌తో నాగ్‌పూర్‌లో విగ్రహం తయారు చేయించి తీసుకువచ్చారు. ఇది దేశంలోనే అతి ఎత్తైన విగ్రహంగా చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు