దళితబంధు జాబితాలో అనర్హులా?

14 Aug, 2021 01:45 IST|Sakshi
శుక్రవారం జమ్మికుంటలో తహసీల్దార్‌తో  దళితుల వాగ్వాదం

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితుల నిరసన 

తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళన 

వదంతులు నమ్మవద్దని కలెక్టర్‌ కర్ణన్‌ విజ్ఞప్తి 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/హుజూరాబాద్‌:  హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో దళితబంధు పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక సరిగా జరగలేదని పలువురు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. ఈనెల 16వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి సభకు లబ్ధిదారులను తీసుకువచ్చేందుకు శుక్రవారం అధికారులు సర్వే చేపట్టారు. ఆ సమయంలో జాబితాలో ఉన్న వారి వివరాలు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీణవంకలో పేదలకు కాకుండా అనర్హులకు జాబితాలో చోటు కల్పించారని ఆరోపిస్తూ పలువురు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వారిని, స్థానికంగా లేని వారిని ఎలా ఎంపిక చేస్తారని తహసీల్దార్‌ సరిత దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ సర్వే చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే విషయంపై హుజూరాబాద్‌ మండలం కందుగుల గ్రామంలో ప్రధాన రహదారిపై దళితులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో 250 దళిత కుటుంబాలు ఉంటే.. కేవలం ఏడుగురిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. అలాగే ప్రగతి భవన్‌కు తమ గ్రామం నుంచి నలుగురు వెళ్తే.. ఇద్దరిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారు. జమ్మికుంటలో కూడా పలువురు దళితులు తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసుల జోక్యంతో వారంతా ఆందోళన విరమించారు.

ఇంకా ఎవరికీ మంజూరు చేయలేదు: కలెక్టర్‌
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికకు సర్వే పూర్తయిందని. అయితే ఇంతవరకూ ఎవరికీ మంజూరు చేయలేదని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ స్పష్టం చేశారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని.. అనంతరం ప్రతి ఒక్కరికీ ఈ పథకం మంజూరుచేస్తామని చెప్పారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, వదంతులను నమ్మవద్దని కోరారు.  

సమాచార లోపం వల్లే..
దీనిపై కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు నాయకులను ‘సాక్షి’ సంప్రదించింది. లబ్ధిదారుల ఎంపికలో ఎవరికీ అన్యాయం జరగదని వారు స్పష్టంచేశారు. 2015లో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఆ సర్వే సమయంలో కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలుసుకునేందుకు 24 గడులు పెట్టిందన్నారు. అవి నింపే క్రమంలో కొందరు సొంతిళ్లు, వాహనాల విషయంలో వాస్తవాలు దాచారన్నారు. తాజా జాబితాలో అలాంటి వారు కనిపించే సరికి, వారికి రూ.10 లక్షల సాయం ఎలా చేస్తారని స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని వివరించారు. సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా లబ్ధిదారులందరికీ న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు. ఇదే తుది జాబితా కాదని, మరిన్ని జాబితాలు ఉంటాయని వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు