ఐటీ డిమాండ్లను తీర్చే సత్తా తెలంగాణకే: కేటీఆర్‌

14 Jan, 2023 00:53 IST|Sakshi
టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

టీ హబ్, డీవీసీ భాగస్వామ్యంతో డీవీసీ ఇండియా ఫండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ రంగ డిమాండ్లను తీర్చే సత్తా తెలంగాణకే ఉందని, స్టార్టప్‌ల ఫలితాలను రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరింపచేస్తా మని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఆర్థికంగా వృద్ధి చెందుతున్న భారతదేశంలో పెట్టుబడులు రాబ ట్టడం కష్టమైనదేమీ కాదని, స్టార్టప్‌లకు నిధులు సేకరణ ఇబ్బందికర అంశంకాదని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని స్టార్టప్‌లకు మార్గదర్శనం చేసే లక్ష్యంతో డల్లాస్‌ వెంచర్‌ కేపిటల్‌(డీవీసీ), టీహబ్‌ శుక్రవారం పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఆరు వేలకుపైగా స్టార్టప్‌లు ఉన్నాయని, దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్‌ను ప్రయోగించిన సంస్థ టీ హబ్‌లోనే పురుడు పోసుకుందని అన్నారు.

డీవీసీ, టీహబ్‌ కలిసి డీవీసీ ఇండియా ఫండ్‌ ఏర్పాటు చేయడం హర్షణీయమని, రెండు ప్రముఖ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం తెలంగాణను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మరింత దోహదం చేస్తుందన్నారు. ఒప్పందంలో భాగంగా డల్లాస్‌ వెంచర్‌ ఫండ్‌ ద్వారా డీవీసీ హైదరాబాద్‌ స్టార్టప్‌లకు నిధులు సమకూరుస్తుందని తెలిపారు.

దేశంలో టెక్‌ స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు రూ.350 కోట్లతో డీవీసీ ఇండియా ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డీవీసీ ఇప్పటికే భారత్‌లో అనేక స్టార్టప్‌ లను నెలకొల్పిందని వివరించారు. కార్యక్రమంలో డీవీసీ ఎండీ దయాకర్‌ పూస్కూర్, సహ వ్యవస్థాపకులు అబిదాలీ నీముచ్‌వాలా, శ్యామ్‌ పెనుమాక, గోకుల్‌ దీక్షిత్, కిరణ్‌ కల్లూరి, టీ హబ్‌ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు. 

స్టార్టప్‌లకు ఊతం
డల్లాస్‌ వెంచర్‌ కేపిటల్‌ 2023లో స్టార్టప్‌లు తమ వాణిజ్య పరిధిని విస్తరించుకునేందుకు ఊతమివ్వడం ద్వారా వినియోగదారుల్లో విస్త తిని పెంచుకునేందుకు సహాయపడుతుంది. దీని కోసం ప్రస్తుతమున్న స్టార్టప్‌లతోపాటు కొత్తగా ఏర్పాటయ్యే స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తుంది. టీ హబ్‌ సహకారంతో వృద్ధి చెందే సామర్థ్యమున్న వినూత్న స్టార్టప్‌లను గుర్తించి అంతర్జాతీయ మార్కెట్‌ లో విస్తరించేందుకు అవసరమైన వినూత్న సాంకేతికత, మౌలిక వసతులు, బృంద సామర్థ్యం పెంపుదల తదితరాల్లో డీవీసీ మార్గదర్శనం చేస్తుంది. 

మరిన్ని వార్తలు