లోపాల్లేవు, అకాల వర్షంతోనే అలా!

8 May, 2022 01:31 IST|Sakshi

యాదగిరిగుట్ట అతలాకుతలంపై అధికారుల నివేదిక 

సమీక్షాసమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వివరణ 

పనులు జరుగుతుండగా భారీ వర్షం రావడమే కారణమని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల కురిసిన అకాలవర్షంతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అతలాకుతలమైనప్పటికీ, పనుల్లో ఎక్కడా లోపాలు లేవని అధికారులు తేల్చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించారు. ఓ వైపు పనులు జరుగుతుండగా, ఉన్నట్టుండి ఒకేసారి భారీ వర్షం కురవటంతోనే ఈ పరిస్థితి నెలకొందని, నాణ్యతలో లోపాలు లేవని నివేదించారు. ఈ మేరకు శనివారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇందుకు సాక్ష్యంగా కొన్ని ఫొటోలు చూపించారు. వాన నిలిచిపోయిన వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు కూడా ఫొటోల ద్వారా వివరించారు. ఇటీవల ఉన్నట్టుండి భారీవర్షం కురవడంతో యాదగిరిగుట్ట దేవాలయం వద్ద దిగువన కొత్త రోడ్డు కొట్టుకుపోయి నేల కుంగిపోవడం, క్యూ కాంప్లెక్సుల్లోకి భారీగా వాననీరు చేరడం, చలువ పందిళ్లు కొట్టుకుపోవడం వంటివి చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

దీంతో పనుల్లో నాణ్యత లోపం ఉందంటూ సర్వత్రా ఆగ్రహం, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం యాడా ఉన్నతాధికారులు, రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీతో సమీక్ష నిర్వహించారు. పనులన్నీ సవ్యంగానే సాగాయని అధికారులు మంత్రికి వివరించారు. పనులు జరుగుతున్న వేళ ఒకేసారి 79 మిల్లీమీటర్ల వాన కురవటంతో గుట్టపై నుంచి వరదలో మట్టి కొట్టుకొచ్చిందని, అది పైపులైన్లలోకి చేరి దిగువకు అడ్డుపడటం వల్లే క్యూ కాంప్లెక్సులోకి నీళ్లు చేరాయని పేర్కొన్నారు.

రోడ్డు నాణ్యతతో నిర్మించినా, పైపులైన్ల కోసం పక్కన గుంతలు తవ్వటంతో ఒక్కసారిగా వచ్చిన వరదతో దిగువ మట్టి కొట్టుకుపోయి రోడ్డు దెబ్బతిన్నదని, ఆ ప్రాంతం కుంగిపోయిందని పేర్కొన్నారు. గుట్టపై నుంచి భారీగా కొట్టుకొచ్చిన ఇసుకలో బస్సులు దిగబడి ముందుకు సాగలేకపోయాయని వివరించారు. 

వానాకాలం నాటికి పూర్తిచేయండి 
ఒకేసారి భారీవర్షం కురవటంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనందున, వచ్చే వానాకాలం నాటికి పనులన్నీ పూర్తి చేస్తే ఈ పరిస్థితి పునరావృతం కాదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు కురిసేనాటికి అంతా సిద్ధం చేసి అప్రమత్తంగా ఉండాల ని ఆదేశించారు. ఇంత భారీ ప్రాజెక్టు పనులు పూర్తి అవుతున్న తరుణంలో ఇలాంటి చిన్న, చిన్న సమస్యలు ఉత్పన్నమవుతాయని, వీటిని అధిగమించేందుకు ప్రయత్నించాలని సూ చించారు.

చలువ పందిళ్లు, మురుగునీటి నిర్వహ ణ, క్యూ లైన్లలో ఫ్యాన్ల ఏర్పాటు, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచటం, గుట్ట దిగువన మొబైల్‌ టాయిలెట్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. రాజకీయలబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలు చేయటం తగదని, ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడొద్దని, చిన్న, చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూడ్డం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, యాడా వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు తదితరులు హాజరయ్యారు.   

ఆ ‘ఖాళీ’ ముప్పుపై దృష్టి పెట్టండి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ క్యూలైన్‌లో ఏర్పడిన ఖాళీపై ‘పొంచి ఉన్న ముప్పు’శీర్షికతో శనివారం సాక్షి లో ప్రచురితమైన వార్తపై దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పందించారు. శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో నిర్వహించిన వైటీడీఏ సమావేశంలో ప్రత్యేకంగా ఈ వార్తపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాక్షిలో ప్రచురితమైన వార్త క్లిప్పింగ్‌ను పరిశీలించమని వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావుకు మంత్రి చూపించారు.  ప్రమాదం జరగకుండా వెంటనే అక్కడ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.  

మరిన్ని వార్తలు