అక్క స్ఫూర్తి, అన్న ఆశయం కోసం.. 

18 Jun, 2022 02:25 IST|Sakshi

ఆర్మీలో చేరేందుకు సిద్ధమైన రాకేశ్‌.. పోలీస్‌ కాల్పుల్లో మృతి 

గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం.. వరంగల్‌కు తరలింపు 

ఖానాపురం:  అక్క బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌.. అన్న కూడా ఆర్మీలో చేరేందుకు చాలా ప్రయత్నించి విఫలమయ్యాడు.. ఆ అక్కను స్ఫూర్తిగా తీసుకుని, అన్న ఆశయాన్ని తాను నెరవేర్చాలనుకుని శిక్షణ పొందాడు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పరుగు పందెం, దేహ దారుఢ్య పరీక్షల్లో విజయం సాధించాడు. రాత పరీక్ష పూర్తయితే ఆర్మీలో చేరడమే ఆలస్యమని అనుకున్నాడు.

కానీ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆర్‌పీఎఫ్‌ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్‌పేట గ్రామానికి చెందిన దామెర రాకేశ్‌ (21) కథ ఇది. దబ్బీర్‌పేటకు చెందిన దామెర కుమారస్వామి–పూలమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల్లో రాకేశ్‌ చిన్నవాడు. బీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

రాకేశ్‌ సోదరి రాణి, సోదరుడు రాంరాజ్‌ సైన్యంలో చేరేందుకు చాలాకాలం ప్రయత్నించారు. 2016 లో రాణి బీఎస్‌ఎఫ్‌ రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా ఎం పికై పశ్చిమబెంగాల్‌లో పనిచేస్తున్నారు. అక్కను స్ఫూర్తిగా తీసుకుని, అన్న ఆశయాన్ని నెరవేర్చాలని నిర్ణయించుకున్న రాకేశ్‌.. రెండేళ్ల క్రితం బాపట్లలో ఆర్మీ ఉద్యోగ శిక్షణ పొందాడు. 2021లో హకీంపేటలో జరిగిన రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొని రాత పరీక్షకు అర్హత సాధించాడు. హకీంపేటలో అర్హత సాధించినవారు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్‌ గ్రూప్‌లో.. ఆందోళన కార్యక్రమం గు రించి తెలిసి స్నేహితులతో కలిసి సికింద్రాబాద్‌కు వచ్చా డు. రైల్వేస్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. 

నేడు దబ్బీర్‌పేటలో అంత్యక్రియలు! 
రాకేశ్‌ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. ప్రత్యేక అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని తమకు చూపకుండానే మార్చురీకి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నేతలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగగా.. శనివారం ఉదయం అప్పగిస్తామని పోలీసులు సర్దిచెప్పారు. రాకేశ్‌ మృతదేహానికి శనివారం దబ్బీర్‌పేటలో అంత్యక్రియలు జరుగుతాయని పోలీసువర్గాలు తెలిపాయి. 

మోదీ నా కొడుకును చంపాడు 
నా కొడుకు పట్టుదలతో చదువుకుంటున్నాడు. ఉద్యోగం సాధిస్తాడనే నమ్మకం ఉండేది. కానీ నా బిడ్డను కేంద్రం పొట్టన పెట్టుకుంది. నరేంద్ర మోదీ నా కొడుకును చంపాడు. ఉద్యోగం రాకున్నా కష్టపడి సాదుకునేవాడిని. నా కొడుకును కనుమరుగు చేశారు. మాకు న్యాయం కావాలి. అంతవరకు మృతదేహానికి అంత్యక్రియలు చేయబోం..     
– దామెర కుమారస్వామి, రాకేశ్‌ తండ్రి  

ప్రాణం పోయినా పోరాటం ఆగదు 
ఛాతీలో పిల్లెట్‌ గాయంతో యువకుడి వీడియో వైరల్‌ 
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్‌):  ‘‘2021లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో రన్నింగ్, ఫిజికల్, మెడికల్‌ టెస్ట్‌ల్లో పాసయ్యాను. రెండేళ్లవుతున్నా రాతపరీక్ష నిర్వహించలేదు. ఇప్పుడు అగ్నిపథ్‌ అంటున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ధర్నా చేస్టుంటే కాల్చారు. ప్రాణం పోయినా మా పోరాటం ఆగదు. ఒకవేళ నేను చనిపోతే పోలీసులు, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కారణం..’’.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కాల్పుల్లో గాయపడిన లక్కం వినయ్‌ (20) బాధ ఇది.

పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన వినయ్‌కు ఛాతీపై కుడి భాగంలో పిల్లెట్‌ తగిలి తీవ్ర గాయమైంది. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అంబులెన్స్‌ సిబ్బంది వినయ్‌తో మాట్లాడుతూ వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వినయ్‌కు చిన్నపాటి శస్త్రచికిత్స చేశామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు