రాజ్యసభ సభ్యులుగా దామోదర్‌రావు, పార్థసారథి రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక 

4 Jun, 2022 04:39 IST|Sakshi
దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డిలకు అభినందనలు చెబుతున్న ప్రశాంత్‌రెడ్డి. చిత్రంలో వద్దిరాజు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. రెండు స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులైన దామోదర్‌రావు, పార్థసారథి రెడ్డి మాత్రమే బరిలో మిగలడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

దామోదర్‌రావు, పార్థసారథి రెడ్డిలకు రాష్ట్ర శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

యూపీ నుంచి కె.లక్ష్మణ్‌ ఎన్నిక
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉత్తరప్ర దేశ్‌ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయ నను బీజేపీ నాయకత్వం ఉత్తర ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దించింది. పోటీ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.  

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు  
‘నాకు రాజ్యసభ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు మరింత సేవ చేస్తాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’     
– పార్థసారథి రెడ్డి 

నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తా 
‘నన్ను విశ్వసించి రాజ్యసభ బాధ్యతను అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తా. సీఎం మార్గదర్శకత్వంలో, తెలంగాణ ప్రాంత, ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తా. రాజ్యసభలో తెలంగాణ వాణిని వినిపిస్తా.’
– దామోదర్‌రావు   

మరిన్ని వార్తలు