హైదరాబాద్‌ మెట్రోలో డ్యాన్స్‌.. యువతికి షాకిచ్చిన అధికారులు

21 Jul, 2022 15:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌ వంటి సోషల్‌ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి అందరికి ఫేమస్‌ అయిపోవాలన్న పిచ్చి బాగా పెరిగిపోతుంది. రీల్స్‌, షార్ట్స్‌ వంటి వీడియోలు రికార్డ్‌ చేసి నెట్టింట్లో అప్‌లోడ్‌ చేయడం తెగ కామన్‌ అయిపోయింది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాల్లోనూ వీడియోలు చీత్రికరిస్తున్నారు. నలుగురిలో పాపులారిటీ తెచ్చుకోవాలన్న భ్రమలో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. 

తాజాగా హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో ఓ యువతి డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే సదరు యువతి స్టేషన్‌లోనే కాకుండా మెట్రో రైల్‌లో కూడా వీడియో చేసినట్లు బయటపడింది. ట్రైన్‌లో ప్రయాణికులు ఉండగానే అందరిముందు టాలీవుడ్‌లోని ఓ పాటకు స్టెప్పులేస్తూ రీల్‌ చేసింది. దీనిని ఇన్‌స్టాలో షేర్‌ చేయింది. అయితే యువతి మెట్రలో డ్యాన్స్‌ చేయడంపై అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోను ఏ స్టేషన్‌లో చిత్రీకరించారో గుర్తించి యువతిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. 

ఇదిలా ఉండగా ఇన్‌స్టా రీల్‌ చేసిన యువతిపై కేసు నమోదైంది. సదరు యువతిని గుర్తించి, ఆమెపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హైదాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ అధికారులు వెల్లడించారు. మరోవైపు సోషల్ మీడియాలో యువతి చర్యపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇలాంటి పిచ్చి ప్రవర్తనను ప్రొత్సహించొద్దు. మెట్రో మీ ప్రైవేటు ఆస్తి కాదు.  ప్రజా రవాణాలో ఇలాంటి ప్రవర్తనను అస్సలు సహించకూడదు.’ అంటూ మండిపడుతున్నారు

కాగా గతంలో రైలు బోగీల్లోనూ పలువురు డ్యాన్స్‌ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. నగర మెట్రో రైళ్లలో అధికారుల అనుమతితో కొన్ని టాలీవుడ్, బాలీవుడ్‌ సినిమా సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇటీవల బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న ఓ సినిమాను మాదాపూర్‌ మెట్రో స్టేషన్‌ ఆవరణలో చిత్రీకరించడం విశేషం. 

మరిన్ని వార్తలు