సభా వేదిక పేచీ: కోమటిరెడ్డి వర్సెస్‌ రేవంత్‌రెడ్డి

14 Aug, 2021 01:11 IST|Sakshi

వివాదంగా మారిన కాంగ్రెస్‌ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ 

ఇబ్రహీంపట్నం నుంచి మహేశ్వరం సమీపానికి మార్చిన టీపీసీసీ 

ఎంపీ కోమటిరెడ్డి అభ్యంతరమే కారణం.. రేవంత్‌ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు 

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో జరగాల్సిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభా వేదిక మారింది. భువనగిరి పార్లమెంటు స్థానం పరిధిలోని ఇబ్రహీంపట్నం నుంచి చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే మహేశ్వరం సమీపానికి సభా వేదికను మార్చాలని నిర్ణయించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేసినందునే ఈ మార్పు జరిగిందని తెలుస్తోంది. ఈనెల 9న ఇంద్రవెల్లిలో సభావేదికపై నుంచే ఇబ్రహీంపట్నం సభను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, తనను అడగకుండా తన పార్లమెంటు స్థానం పరిధిలోకి వచ్చే ఇబ్రహీంపట్నంలో సభ ఎలా ప్రకటిస్తారని కోమటిరెడ్డి అభ్యంతరం తెలిపారు.

దీనికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ తీరుపై ఆయన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్‌ వరకు వ్యవహారం వెళ్లడంతో ఆయన కోమటిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. అనంతరం కోమటిరెడ్డి, రేవంత్‌లు ఫోన్‌లో మాట్లాడుకున్నారని, తనకు ఈనెల 17 నుంచి 21 వరకు బొగ్గు, స్టీల్‌ పార్లమెంటరీ స్టాం డింగ్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో స్టడీ టూర్‌ ఉన్నందున తాను సభకు రాలేనని, ఆ టూర్‌ కోసం గోవాకు వెళ్తున్నానని కోమటిరెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో సభ పెట్టి ఎంపీ కోమటిరెడ్డి హాజరుకాకపోతే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే సభాస్థలిని మా ర్చాలని నిర్ణయించారని, ఇందుకోసం ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. గతంలో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి రేవంత్‌ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ముగింపు సభను ఏర్పాటు చేసిన రావిర్యాలలోనే దళిత గిరిజన దండోరా సభను కూడా నిర్వహించాలని నిర్ణయించినట్టు గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఇబ్రహీంపట్నం సభకు పోలీసులు అను మతి నిరాకరించారు. ఇక్కడ సభ నిర్వహిస్తే ట్రాఫిక్‌ సమస్య తలెత్తుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.   

మరిన్ని వార్తలు