విద్యార్థుల వెన్నంటే కరోనా భయం!

6 Mar, 2021 02:17 IST|Sakshi

పాఠశాలలు, హాస్టళ్లలో నమోదవుతున్న కరోనా కేసులు

పిల్లలను హాస్టళ్లకు పంపేందుకు ఇష్టపడని తల్లిదండ్రులు

తప్పని పరిస్థితుల్లో స్కూళ్లకు టెన్త్‌ విద్యార్థులు.. ఝరాసంగం కేజీబీవీలో 19 మందికి కరోనా

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల తల్లిదండ్రులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు ఇంకా భయపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా హాస్టల్‌ సదుపాయం కలిగిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలకు (కేజీ బీవీ), గురుకుల పాఠశాలలకు పంపేందుకు ససే మిరా అంటున్నారు. స్కూళ్లు, హాస్టళ్లలో కరోనా వ్యాప్తి చెందుతుందేమోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధనకు మాత్రం గత్యం తరం లేని పరిస్థితుల్లో విద్యార్థులను (75–80%) స్కూళ్లకు పంపిస్తున్నారు. గత నెల 24 నుంచి ప్రారంభమైన 6, 7, 8 తరగతుల ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థులు 50 శాతం కూడా ఉండట్లేదు. ఇక హాస్టల్‌ వసతి ఉన్న గురుకులాలు, కేజీబీ వీల్లో విద్యార్థుల సంఖ్య 20 శాతానికి మించట్లేదు.

భయపెడుతున్న కేసులు..
ఇటీవల సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేజీబీవీలో 19 కేసులు నమోదు కావడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేజీబీవీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు, టీచర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ గిరిజన ఆశ్రమ (బాలికల) పాఠశాలలో ఏడుగురికి కరోనా సోకింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థినికి కరోనా సోకింది. వికారాబాద్‌ జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇద్దరు టీచర్లకు పాజిటివ్‌ వచ్చింది. నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలంలో ఇద్దరు టీచర్లకు కరోనా సోకింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇద్దరు టీచర్లు, ఒక విద్యార్థికి కరోనా వచ్చింది. ధర్మపురి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉపాధ్యాయుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. భద్రాద్రి కొత్తగూడెం మేదరబస్తిలో ఒక టీచర్‌కు, కరకగూడెం కేజీబీవీలో 9వ తరగతి విద్యార్థినికి పాజిటివ్‌ వచ్చింది. ఇలా టీచర్లకు, విద్యార్థులకు కరోనా సోకుతుండటంతో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు.

ఇదీ విద్యార్థుల హాజరు పరిస్థితి..

  • రాష్ట్రంలోని కేజీబీవీల్లో 6, 7, 8 తరగతులకు చెందిన బాలికలు 50,727 మంది ఉండగా, 13,065 మంది (25.75 శాతం) తల్లిదండ్రులను తమ పిల్లలను హాస్టళ్లకు పంపేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. అంగీకార పత్రాలు అందజేసిన వారంతా కూడా తమ పిల్లలను కేజీబీవీ హాస్టళ్లకు పంపట్లేదు. మొత్తం విద్యార్థుల్లో 9,695 మంది (19.11 శాతం) పిల్లలను మాత్రమే పంపిస్తున్నారు.
  • 9, 10 తరగతుల బాలికలు కేజీబీవీల్లో 36,148 మంది ఉండగా, 30,231 మంది విద్యార్థులను స్కూళ్లకు పంపించేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. వారిలో 28,524 మంది (78.91 శాతం) మాత్రమే స్కూళ్లకు వస్తున్నారు.
  • 11, 12 తరగతుల (ఇంటర్మీడియట్‌) విద్యార్థులు కేజీబీవీల్లో 18,986 మంది ఉండగా, అందులో 14,667 మంది బాలికలను హాస్టళ్లకు పంపించేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. వారిలో 12,954 మందిని (66.05 శాతం) కేజీబీవీలకు పంపించారు.
  • రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలో 37 గురుకుల విద్యాలయాలు కొనసాగుతున్నాయి. అందులో 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్థులు 8,216 మంది ఉండగా, 746 మంది (9.07 శాతం మంది) విద్యార్థులే గురుకులాలకు వచ్చారు. 9, 10, 11, 12వ తరగతి విద్యార్థులు మాత్రం 81 శాతం మంది హాస్టళ్లకు వచ్చినట్లు విద్యా శాఖ చెబుతోంది.
  • 7,986 ప్రభుత్వ పాఠశాలల్లో 5,52,654 మంది 6, 7, 8 తరగతుల విద్యార్థులుంటే, 2,52,834 మంది (46 శాతం) విద్యార్థులు మాత్రమే ప్రత్యక్ష బోధనకు హాజరవుతున్నారు.
  • 194 మోడల్‌ స్కూళ్లలో ఆయా తరగతుల విద్యార్థులు 49,035 మంది ఉండగా, అందులో 19,883 మంది (41 శాతం) మాత్రమే ప్రత్యక్ష బోధనకు హాజరవుతున్నారు.


కేజీబీవీల్లో హాజరు పరిస్థితిదీ..
తరగతి    మొత్తం విద్యార్థులు    అంగీకారపత్రం ఇచ్చింది    స్కూల్‌కు వస్తున్నది    హాజరుశాతం
6           13,417                 3,606                           2,749                    20.71
7           18,350                 4,560                           3,241                    17.66
8           18,960                 4,899                           3,675                    19.38
9           18,784                14,552                          13,515                  71.95    
10         17,364                 5,679                           15,009                  86.44
11         10,337                 8,178                           7,241                    70.05
12         8,649                   6,489                           5,713                    66.05

 

ఇవీ జిల్లాల వారీగా స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీల్లో నమోదైన పాజిటివ్‌ కేసులు..
జిల్లా                మొత్తం కేసులు         ప్రాంతం
ఆదిలాబాద్‌            7               బోథ్‌-6, ఆదిలాబాద్‌ -1
వరంగల్‌ అర్బన్‌      2               కరీమాబాద్‌
జగిత్యాల              4                కోరుట్ల-3, ధర్మపురి- 1
సిరిసిల్ల                1                శివనగర్‌
భద్రాద్రి                 2                మేదరబస్తీ-1, కరకగూడెం-1
సంగారెడ్డి             19              ఝరాసంఘం
మంచిర్యాల           3               ములకల-1, గర్మిల్ల-2
నిర్మల్‌                 2               లక్ష్మణచాంద
వికారాబాద్           2               వికారాబాద్‌

మరిన్ని వార్తలు