NH 44: ఆ జాతీయ రహదారి మృత్యు దారి!.. ఐదేళ్లలో ఏకంగా 1066 ప్రమాదాలు.. కారణాలేంటి?

19 Feb, 2022 12:32 IST|Sakshi
శుక్రవారం స్థానికులు, వివిధ పార్టీల నాయకుల ఆందోళనతో ఎన్‌హెచ్‌ 44పై కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

జైనథ్‌ మండలంలోని గిమ్మ ఎక్స్‌రోడ్‌ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై ఈనెల 16న లారీ ఢీకొని ఆంకోలి గ్రామానికి చెందిన వడరపు రాజారెడ్డి(59) మృతిచెందాడు. మరమ్మతుల  కారణంగా తాత్కాలికంగా వన్‌వే ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తున్న లారీని డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడిపి బైక్‌ను ఢీకొన్నాడు. 

జైనథ్‌ మండలం భోరజ్‌ వద్ద ఈనెల 17న ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ఆకిటి వెంకట్‌రెడ్డి ఏకైక కూతురు చైత్ర(13)కు జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బైక్‌పై బయలుదేరాడు. భోరజ్‌ ఎక్స్‌ రోడ్‌ సమీపంలో వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొంది. చైత్ర కుడివైపుకు పడిపోవడంతో లారీ ఆమె మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.  

ఆదిలాబాద్‌ పట్టణం సాయినగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఏనుగు పద్మ(56) శుక్రవారం స్కూటీపై బేల మండలం ఏటీ పాఠశాలకు బయల్దేరారు. జైనథ్‌ మండలం భోరజ్‌ చెక్‌పోస్ట్‌ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆమె కిందపడిపోగా, లారీ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పాఠశాలకు బయల్దేరిన 15 నిమిషాల్లో మృత్యువు కబళించింది. 

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో సుమారు వంద కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న 44వ నంబర్‌ జాతీయ రహదారి నెత్తురోడుతోంది. ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఈ రోడ్డుపై ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. ప్రమాదాల నివారణకు కృషి చేయాల్సిన రోడ్‌ సేఫ్టీ కమిటీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2016 నుంచి 2020 వరకు ఎన్‌హెచ్‌ 44పై 1,066 ప్రమాదాలు జరుగడం కమిటీల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది.

ఈ కమిటీలో కీలకపాత్ర పోషించే రవాణా శాఖ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన బారికేడ్లతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది. శుక్రవారం ఉదయం ఉపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి బారికేడ్లే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో సంఘటన స్థలంలో నిరసన చేపట్టిన కొంతమంది రవాణ శాఖపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్‌ చేయడం  గమనార్హం. 


చదవండి: మేడారం వెళ్లే దారిలో ఘోర రోడ్డు ప్రమాదం. నలుగురు మృత్యువాత

రవాణాశాఖే ఉల్లంఘన..!
సమాచార హక్కు చట్టం ద్వారా జిల్లాకేంద్రం శాంతినగర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేత బాలూరి గోవర్ధన్‌రెడ్డి వివిధ అంశాలపై 2020లో వివిధ వివరాలను నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌లోని ప్రాంతీయ అధికారిని కోరగా, అదే సంవత్సరం జూన్‌ 16న మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి వరకు జాతీయ రహదారిపై హైవే అథారిటీ ద్వారా ఎలాంటి చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరగలేదని సమాధానం ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో జైనథ్‌ మండలం భోరజ్‌ చెక్‌పోస్టు వద్ద బారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది. భద్రత కమిటీలో కీలకంగా వ్యవహరించాల్సిన రవాణాశాఖ పరంగానే లోపాలు కనిపిస్తుండటం విస్మయం కలిగిస్తోంది.

నిధులు మంజూరైనా నిర్లక్ష్యం.. 
ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ బోయిన్‌పల్లి వరకు జాతీయ రహదారి 44కు సంబంధించి రహదారి భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ గతంలో ఆడిట్‌ నిర్వహించారు. అనేక బ్లాక్‌ స్పాట్స్‌లను గుర్తించారు. ప్రమాదాల నివారణ కోసం రహదారిపై చేపట్టాల్సిన పనులకు సంబంధించి పెన్‌గంగ నుంచి ఇచ్చోడ దగ్గర ఇస్లాంనగర్‌ వరకు వివిధ రోడ్డ భద్రత పనుల కోసం రూ.40.28 కోట్లు మంజూరు చేశారు. అందులో కొన్ని పనులు పూర్తి చేశారు. మిగతా పనులు నిర్మాణంలో ఉన్నాయి. భోరజ్‌ వద్ద స్లిప్‌ రోడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతోనే ద్విచక్రవాహనదారులు జాతీయ రహదారిమీదుగానే ప్రయాణిస్తున్నారు. స్లిప్‌ రోడ్డు నిర్మాణమై ఉంటే గురువారం చైత్ర(13), శుక్రవారం ఉపాధ్యాయురాలు పద్మ(56) దానిమీదుగా ప్రయాణించేవారు. వారి ప్రాణాలు పోయేవికావు. ఇక్కడ సమష్టిగా రోడ్డు భద్రతావైఫల్యం కనిపిస్తోంది. 

స్పీడ్‌ గన్లు ఎక్కడ?
జిల్లాలో పెన్‌గంగ వద్ద నుంచి జాతీయ రహదారి 44 మొదలవుతుంది. నిర్మల్‌ జిల్లా వరకు వంద కిలో మీటర్ల పరిధిలో జిల్లాలో విస్తరించి ఉంది. ఈ రహదారిపై మావల నుంచి నిర్మల్‌ వైపు వెళ్లే దారిలో పోలీసు శాఖ పరంగా పలుచోట్ల స్పీడ్‌ గన్లు ఏర్పాటు చేసి అతివేగంగా వెళ్లే వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. పెన్‌గంగ నుంచి మావల వరకు స్పీడ్‌ గన్లు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు జాతీయ రహదారిపై వేగంగా దూసుకుపోతున్నారు.  


చదవండి: పెట్టీ కేసులో సైఫాబాద్‌ పోలీసుల దురుసు ప్రవర్తన.. లాఠీలతో మహిళలపై దాడి?

వరుస ప్రమాదాలతో ఆందోళన..
మూడు రోజులుగా ఈ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. పెన్‌గంగ నుంచి ఇస్లాంనగర్‌ వరకు జాతీయ రహదారి రెన్యూవల్‌ పనులు జరుగుతున్నాయి. హైవే నుంచి స్లిప్‌ రోడ్లు, సర్వీస్‌ రోడ్లు సరిగ్గా లేకపోవడంతో అనేకంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు మృత్యువాత పడ్డ తర్వాత భద్రత కమిటీ మేల్కొంది. శుక్రవారం సాయంత్రం ఈ కమిటీ సభ్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇకనైనా వేగిరంగా పనులు చేపట్టి హైవేపై ప్రాణాలు పోకుండా చర్యలు చేపడతారో.. లేదో వేచిచూడాలి. కాగా పనుల విషయంలో వివరాలు అడిగేందుకు ఎన్‌హెచ్‌ఏఐ పీడీ శ్రీనివాస్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

మరిన్ని వార్తలు