ఢిల్లీకి ‘దర్భంగ ఉగ్రవాదులు’ 

13 Jul, 2021 08:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బిహార్‌లోని దర్భంగ రైల్వే స్టేషన్‌లో జరిగిన విస్ఫోటనం కేసులో నిందితులుగా ఉన్న లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఇమ్రాన్‌ మాలిక్, నాసిర్‌ మాలిక్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఢిల్లీకి తరలించారు. ఇద్దరినీ హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతంలో పట్టుకున్న విషయం తెలిసిందే. వీరి కస్టడీ గడువు పూర్తి కావడంతో శుక్రవారం బిహార్‌ రాజధాని పట్నాలో ఉన్న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరి నుంచి మరికొంత సమాచారం సేకరించాల్సి ఉందని, మరో పది రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీన్ని విచారించిన న్యాయస్థానం ఈ నెల 16 వరకు అనుమతించింది. దీంతో ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు సోమవారం బిహార్‌ నుంచి ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈ ఉగ్రవాద కుట్రలో కీలకంగా వ్యవహరించిన ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానా వాసి సలీంను సైతం కస్టడీలోకి తీసుకోవాలని ఎన్‌ఐఏ భావించింది. అనారోగ్య కారణాలతో అతగాడు పట్నా హాస్పిటల్‌లో చేరడంతో సాధ్యం కాలేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఓ ప్రత్యేక బృందం సిటీకి వచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు