దర్భంగ కేసు’.. ఎవరీ ఇక్బాల్‌ ఖానా? 

7 Jul, 2021 08:23 IST|Sakshi

తొలినాళ్లలో ఖైరానాలో కూరగాయల వ్యాపారం

హాజీ అనీస్‌ పరిచయంతో నేరజీవితం ప్రారంభం

1995 నుంచి పాకిస్థాన్‌లోని లాహోర్‌లో మకాం

ఐఎస్‌ఐ ఏజెంట్‌ తారీఖ్‌తో కలిసి వ్యవహారాలు 

‘దర్భంగ కేసు’లో ప్రధాన సూత్రధారి ఇతగాడే..

సాక్షి, హైదరాబాద్‌: దర్భంగ ఎక్స్‌ప్రెస్‌ దహ నానికి కుట్ర కేసుతో ఇక్బాల్‌ ఖానా పేరు దక్షిణాదిలో వెలుగులోకి వచ్చింది. ఉత్తరాది పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలకు ‘సుపరిచితుడైన’ ఇతడే ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా(ఎల్‌ఈటీ) తరఫున పనిచేస్తూ మల్లేపల్లిలో నివసించిన అన్నదమ్ములు ఇమ్రాన్‌ మాలిక్, నాసిర్‌ మాలిక్‌లతో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన హాజీ, ఖఫీల్‌ను ఉగ్రవాదులుగా మార్చాడు. వీరి ద్వారానే దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం సృష్టించడానికి కుట్రపన్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థకు(ఎన్‌ఐఏ) మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన ఇక్బాల్‌ ఖానా నేపథ్యమిది.. 

►ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ సమీపంలో ఉన్న ఖైరానా ప్రాంతానికి చెందిన ఇతడి అసలు పేరు మహ్మద్‌ ఇక్బాల్‌ మాలిక్‌. పుట్టుకతోనే కుడి కంటిలో లోపం ఉండటంతో ఇక్బాల్‌ ఖానాగా మారాడు.
►ఖైరానా ప్రధాన రహదారిపై కూరగాయల దుకాణం నిర్వహించే ఇక్బాల్‌కు ఆది నుంచి ధనార్జనపై ఆశ ఎక్కువగా ఉండేది. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తమ ప్రాంతానికే చెందిన గోల్డ్‌ స్మగ్లర్‌ హాజీ అనీస్‌ ముఠాలో చేరాడు.
►1980 నుంచి బంగారం స్మగ్లింగ్‌ చేసిన ఈ గ్యాంగ్‌ 1990లో ఇక్బాల్‌ చేరిన తర్వాత మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కూడా ప్రారంభించింది. దీంతో ఖైరానా ప్రాంతానికి చెందిన మిగిలిన ముఠాలతో వైరం ఏర్పడింది.
►ఇక్బాల్‌ 1992లో యూపీలోని సహరన్‌పూర్‌కు చెందిన ముస్తారీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. 1993–94లో రెండుసార్లు ప్రత్యర్థి వర్గాలు ఇక్బాల్‌పై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేశాయి. 
►మరోపక్క పోలీసు నిఘా కూడా ముమ్మరం కావడంతో 1995 జూన్‌లో పాక్‌కు మకాం మార్చిన ఇక్బాల్‌ అక్కడి లాహోర్‌లో ఉన్న బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందాడు. 
కొన్నాళ్లకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెల్నీ అక్కడకు రప్పించుకున్నాడు.
►లాహోర్‌ చేరిన తొలినాళ్లలో ఇక్బాల్‌ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడలేదు. అక్కడి యతీంఖానా ప్రాంతంలో నివసించే ఐఎస్‌ఐ ఏజెంట్‌ తారిఖ్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత స్మగ్లర్‌గా మారాడు.
►ఇక్బాల్‌ నేరచరిత్ర, ఖైరానా ప్రాంతంలో అతడికి ఉన్న పరిచయాలు, భారత్‌లో ఉన్న నెట్‌వర్క్‌ తెలుసుకున్న తారిఖ్‌ అతడి ద్వారా ఆయుధాలను అక్రమ రవాణా చేయించాడు. వీటిని ఖైరానాలో ఉన్న ఇక్బాల్‌ గ్యాంగ్‌ ఉత్తరాదిలో విక్రయించేది.

►1996 నుంచి భారీస్థాయిలో ఆయుధాల సరఫరా స్మగ్లింగ్‌ చేయాలని తారిఖ్‌–ఇక్బాల్‌లు భావించారు. అందుకోసం అప్పట్లో పాకిస్థాన్‌లో నివసించిన స్విస్‌ జాతీయుడు క్రిస్టోఫర్‌ను వాడుకున్నాడు.
►అతడి కార్‌వ్యాన్‌లో రహస్య అరలు ఏర్పాటు చేసి వాటిలో ఆయుధాలు మందుగుండు సామాగ్రి నింపారు. ఖర్చుల కోసం రూ.లక్ష ఇచ్చి భారత్‌కు పంపారు. ఆయుధాల డెలివరీ పూర్తయిన తర్వాత మరో రూ.35 వేల డాలర్లు ఇస్తామన్నారు. 
►ఇతగాడిని ఢిల్లీ పోలీసులు 1996 ఫిబ్రవరి 17న అరెస్టు చేసి భారీస్థాయిలో ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు. క్రిస్టోఫర్‌కు సహకరిస్తున్న హసన్‌ పోద్దార్‌ను పట్టుకున్నారు. ►వీరి విచారణలోనే ఇక్బాల్‌ లాహోర్‌ కేంద్రంగా చేస్తున్న కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇతగాడు భారత ఏజెన్సీలకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారాడు. 1999 తర్వాత ఐఎస్‌ఐకి మరింత సన్నిహితంగా మారాడు. 
►భారత సైనిక రహస్యాలను అందించడానికి అవసరమైన ఏజెంట్లను రిక్రూట్‌ చేసుకోవడం ప్రారంభించాడు. ఇలా ఇతడి కోసం పనిచేస్తున్న ఖైరానావాసి సమయుద్దీన్‌ 2001 డిసెంబర్‌లో పట్టుబడ్డాడు.
►ఆ తర్వాత నుంచి భారత్‌కు నకిలీ కరెన్సీ సరఫరా, చెలామణి కోసం ఐఎస్‌ఐ ఇక్బాల్‌ను వాడుకుంది. ఏటా వందల కోట్ల నకిలీ కరెన్సీని తన అనుచరుల ద్వారా చెలామణి చేయించాడు. 
► పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు ఇక్బాల్‌ మాలిక్‌ నకిలీ కరెన్సీ చెలామణి నుంచి ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్‌ వైపు మారాడు. తాజాగా లష్కరే తొయిబా కోసం కొందరిని రిక్రూట్‌ చేసి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు ప్లాన్‌ చేశాడు.  

       

మరిన్ని వార్తలు