తేనెను జుర్రేసే ప్రత్యేక పురుగు.. దీని నాలుక ఎంత పెద్దదో తెలుసా?

2 Oct, 2021 11:17 IST|Sakshi

తేనెటీగలు, తుమ్మెదలు, ఇంకా కొన్నిరకాల పురుగులు పూలలో తేనెను జుర్రేస్తూ మజా చేస్తుంటాయి. పూల లోపలికి నాలుక (గొట్టం వంటి ప్రత్యేక నిర్మాణం) చాపి తేనెను పీల్చేస్తాయి. మరి బాగా పెద్దవో, పొడుగ్గానో ఉండే పూలు అయితే ఎలా? అలాంటి పూల నుంచీ తేనెను జుర్రేసే ప్రత్యేకమైన పురుగే.. డార్విన్స్‌ మోత్‌ (చిమ్మట). ఆఫ్రికా ఖండం తీరానికి సమీపంలోని మడగాస్కర్‌ దీవుల్లో ఉండే ఈ పురుగు నాలుక ఎంత పెద్దదో తెలుసా..

ఏకంగా 11.2 అంగుళాలు. ఇంచుమించు ఒక అడుగు పొడవు అన్నమాట. ఆ పురుగు సైజు మాత్రం రెండు, మూడు అంగుళాలే ఉంటుంది. డార్విన్స్‌ మోత్‌ ప్రత్యేకతలపై ఇటీవల పరిశోధన చేసిన లండన్‌ నేచురల్‌ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు.. దాని నాలుక పొడవును కొలిచి రికార్డు చేశారు. 
చదవండి: మా నాన్న క్రేజీ.. పొద్దున మాత్రం లేజీ’.. ఐదేళ్ల చిన్నారి ఫన్నీ కవిత వైరల్‌

చూడక ముందే ఊహించి.. 
జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్‌ డార్విన్‌కు ఈ చిమ్మట పురుగుకు ప్రత్యేక సంబంధం ఉంది. మడగాస్కర్‌లో చెట్లు, మొక్కలను పరిశీలిస్తున్న క్రమంలో డార్విన్‌కు ‘అంగ్రాకమ్‌ సెస్కీపెడబుల్‌’గా పిలిచే ఒకరకం ఆర్కిడ్‌ పూల మొక్క కనబడింది. దాని పూల కాడలు చాలా పొడవుగా ఉండి.. కిందివైపున తేనె (నెక్టార్‌) ఉన్నట్టు గుర్తించారు.
చదవండి: గోల చేయని భార్య! ప్చ్‌.. నాలుగు రోజులకే విడాకులు

ఇలాంటి పూల నుంచి తేనె పీల్చే సామర్థ్యమున్న పురుగులు ఉండి ఉంటాయని, వాటి నాలుక చాలా పొడవుగా ఉంటుందని 1862వ సంవత్సరంలోనే డార్విన్‌ అంచనా వేశారు. కానీ తర్వాత 40 ఏళ్ల వరకు కూడా ఎవరూ ఆ పురుగులను గుర్తించలేకపోయారు. 1903వ సంవత్సరంలో కొందరు శాస్త్రవేత్తలకు ఈ పురుగు కంటబడింది. దానిని ముందే ఊహించిన డార్విన్‌ పేరిటే దీనికి ‘డార్విన్స్‌ మోత్‌’ అని నామకరణం చేశారు. 
–సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు