కొడుకు తలకొరివి పెట్టనన్నాడు.. కూతురు రుణం తీర్చుకుంది..

20 Aug, 2021 08:12 IST|Sakshi
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో తండ్రి చితికి నిప్పంటిస్తున్న కుమార్తె మీనాక్షి

అశ్వారావుపేట రూరల్‌:  పదహారేళ్ల కుమారుడిని సక్రమ మార్గంలో నడిపించేందుకు తండ్రి పోలీసులతో కౌన్సెలింగ్‌ చేయించాడు. కానీ తన మంచి కోసమే ఆ పనిచేశాడని మరిచిపోయిన ఆ కుమారుడు తండ్రిపై కోపం పెంచుకుని ఆయన మరణిస్తే తలకొరివి పెట్టేందుకూ ఒప్పుకోలేదు. దీంతో కూతురే తండ్రికి తలకొరివిపెట్టి రుణం తీర్చుకుంది. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన లింగిశెట్టి నీలాచలం (38) స్థానికంగా సెలూన్‌ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన చేసిన అప్పులు పెరగడం, తీర్చే మార్గం లేకపోవడంతో బుధవారం రాత్రి తన ఇంట్లోని పక్క పోర్షన్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దీన్ని గురువారం గుర్తించిన ఆయన భార్య లక్ష్మి స్థానికుల సాయంతో కిందకు దించగా...అప్పటికే నీలాచలం మృతి చెందాడు. అనంతరం నీలాచలం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కొడుకు (16) చేత తలకొరివి పెట్టించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తుండగా, తాను పెట్టనని నిరాకరించాడు. గతంలో జులాయిగా తిరుగుతున్నాననే నెపంతో తన తండ్రి పోలీసులతో కౌన్సెలింగ్‌ చేయించాడని, అందుకే తలకొరివి పెట్టబోనని మొండికేశాడు. బంధువులు, పెద్దలు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడంతో కుమార్తె మీనాక్షి తలకొరివి పెట్టింది.

మరిన్ని వార్తలు