మా నాన్న అంత్యక్రియలు మీరే చేయండి  

27 May, 2021 06:39 IST|Sakshi

 పోలీసులను కోరిన మృతుడి కుమార్తెలు  

జవహర్‌నగర్‌: కరోనా మహమ్మారి మిగిల్చిన ఓ విషాదకర ఘటన జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కుడిపూడి గున్నయ్య (75) కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వచ్చి సంతోష్‌నగర్‌లో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. గున్నయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీనివాస్‌ చిన్నతనం నుంచే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కుమార్తెలకు వివాహమై ప్రస్తుతం  తూర్పు గోదావరి జిల్లాలోనే కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు.

రెండేళ్ల క్రితం గున్నయ్య భార్య అనారోగ్యంతో చనిపోయారు. వారం రోజులుగా గున్నయ్య, కుమారుడు శ్రీనివాస్‌ కరోనా బారిన పడి నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు వారిద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గున్నయ్య మంగళవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో వైద్యులు తూర్పు గోదావరిలో ఉన్న ఆయన కుమార్తెలకు తండ్రి మరణ వార్త చెప్పారు.

లాక్‌డౌన్‌ కారణంగా అక్కడికి రాలేకపోతున్నామని, పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించాలని కూతురు నాగ శ్రీదేవి వాట్సాప్‌ ద్వారా వేడుకున్నారు. స్పందించిన పోలీసులు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం గున్నయ్య కుమారుడు శ్రీనివాస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి మరణించిన విషయం అతనికి తెలియదు.
చదవండి: దైవ దర్శనానికి వెళ్లొస్తామంటూ.. ముగ్గురి బలవన్మరణం  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు