పగలూ రాత్రీ బాదేస్తున్నారు! 

22 Aug, 2022 09:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు పనితీరుకు ప్రామాణికమంటూ డీజీపీ కార్యాలయం అమలులోకి తీసుకువచ్చిన వర్టికల్స్‌ విధానం అటు పోలీసులు, ఇటు నగర వాసులకు నరకం చూపిస్తోంది. ఇందులో నిర్దేశించిన మేరకు డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల కోసం ట్రాఫిక్‌ విభాగం అధికారులు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా రోడ్డున పడుతున్నారు. అదేమంటే రోడ్డు ప్రమాదాల నిరోధం కోసమే ఇవన్నీ చేస్తున్నామని చెబుతున్నారు. సీన్‌ కట్‌ చేస్తే. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు కావడం తప్ప ఆశించిన స్థాయిలో రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గట్లేదు. 

పనితీరు మదింపు..
శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్‌ వింగ్‌ సహా ప్రత్యేక విభాగాలను పని తీరును మథించడానికి డీజీపీ కార్యాలయం వర్టికల్స్‌ విధానాన్ని రూపొందించింది. బీటు కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారుల వరకు ఎవరెవరు, ఏ రకమైన విధులు నిర్వర్తించాలనేది నిర్దేశించింది. వీటిని వీళ్లు ఎంత సమర్థంగా వ్యవహరిస్తున్నారన్నది గుర్తించడానికంటూ వర్టికల్స్‌ విధానం అమలులోకి తీసుకువచ్చారు. ప్రతి నెలా ఆయా అధికారులు తమ పని తీరును ఈ వర్టికల్స్‌లో నిర్దేశించిన విధంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే డీజీపీ కార్యాలయం ర్యాంకింగ్స్‌ ఇస్తూ ఉత్తమ అధికారులను గుర్తిస్తోంది. 

డీడీ తనిఖీలను చేర్చి.. 
సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ వంటి ప్రత్యేక విభాగాలకు సైతం కొన్ని అంశాలను నిర్దేశించారు. ట్రాఫిక్‌ పోలీసుల విషయానికి వచ్చేసరికే అసలు సమస్య వచ్చిపడుతోంది. వీళ్లు నిర్వర్తించే ప్రతి పనీ నేరుగా నగర వాసులు ఇంకా పక్కాగా చెప్పాలంటే వాహన చోదకులతో ముడిపడి ఉంటుంది. ట్రాఫిక్‌ పోలీసుల పనితీరును గుర్తించే వర్టికల్స్‌లో పెండింగ్‌ ఈ–చలాన్ల వసూలుతో పాటు డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీలను డీజీపీ కార్యాలయం చేర్చింది. ఒక్కో పోలీసుస్టేషన్‌ ఒక నెలలో ఏ తరహావి, ఎన్ని కేసులు నమోదు చేస్తోందనేది గణిస్తోంది.

ఆ ప్రాంతాలు, సమయాల్లో చేస్తే ఒకే... 
నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు గడిచిన కొన్నాళ్లుగా ప్రతి రోడ్డు ప్రమాదాన్నీ అధ్యయనం చేస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో, ఏయే సమయాల్లో, ఏ కారణం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశంపై నివేదికలు రూపొందించారు. వీటి ఆధారంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ కారణంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో, ఆ సమయాల్లో ఈ తనిఖీలు నిర్వహించేలా చేస్తే సరిపోతుంది. అలా కాకుండా అనునిత్యం రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వీటిని నిర్వహిస్తుండటంతో అటు పోలీసులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి పరిస్థితులను మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది.  

తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి..  
ట్రాఫిక్‌ విభాగం అధికారులు వర్టికల్స్‌ను అందుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పగలు–రాత్రి తేడా లేకుండా రోడ్లపై డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలన్నీ ప్రధాన రహదారులపై జరుగుతుండటంతో ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడుతున్నాయి. మరోపక్క అసలే అరకొర సిబ్బందితో ఉన్న ట్రాఫిక్‌ ఠాణాలకు ఈ తనిఖీలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. రాత్రి వేళల్లో డ్రంక్‌ డ్రైవింగ్‌ చేసిన వాళ్లూ ఉదయం డ్యూటీకి రావాల్సి రావడం.. ఒక్కోసారి మళ్లీ పగటిపూట కూడా ఈ తనిఖీలు చేయాల్సి వస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. పని భారం తప్పించాలంటూ ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు.   

(చదవండి: వాహనదారులకు అలర్ట్‌ ఈ రూట్స్‌లో వెళ్లకండి.. ట్రాఫిక్‌ మళ్లింపులు కలవు)

మరిన్ని వార్తలు