యువతిపై దాడి చేసి చంపిన వైనం

30 Nov, 2020 08:22 IST|Sakshi

18 రోజుల్లో పులికి బలైన ఇద్దరు గిరిజనులు 

భయాందోళనలో అటవీ ప్రాంత ప్రజలు

సాక్షి, మంచిర్యాల/పెంచికల్‌పేట్‌/బెజ్జూర్‌: రాష్ట్రంలోని అటవీ గ్రామాల్లో పులుల అలజడి కొనసాగుతోంది. కొన్ని రోజుల కిందటే పెద్ద పులి దాడిలో ఒకరు మరణించిన ఘటన మరువక ముందే మరో గిరిజన యువతిని పులి బలి తీసుకుంది. కుమురం భీం జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి శివారులో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొండపెల్లికి చెందిన పసుల నిర్మల (18) తల్లి లస్మక్క మరికొందరు కూలీలతో కలసి అన్నం సత్తయ్య చేనులో పత్తి తీసేందుకు వెళ్లింది. కూలీలంతా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తినేందుకు వెళ్తుండగా నిర్మలపై వెనక నుంచి ఒక్కసారిగా పులి దాడి చేసింది. మొదట నడుముపై పంజాతో తీవ్రంగా గాయపర్చింది. ఆ తర్వాత గొంతుపై కరచుకుని లాక్కెళ్లింది. అక్కడే ఉన్న అన్నం చక్రవర్తి అనే యువకుడు కర్రతో పులిని బెదిరించగా మరోసారి దాడి చేసేందుకు యత్నించి పారిపోయింది. చూస్తుండగానే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు జిల్లా అటవీ అధికారి శాంతారామ్, ఎఫ్‌డీవో వినయ్‌కుమార్, రేంజ్‌ అధికారులు ఘటనాస్థలాన్ని చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. దాడి చేసిన పులి గురించి వివరాలు సేకరించారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ క్రిష్ణ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ ఐదు టీంలతో రెండు చోట్ల బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధిస్తామన్నారు. సమీప అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. 

వణుకుతున్న అటవీ గ్రామాలు.. 
ఈనెల 11న దహెగాం మండలం దిగిడలో విఘ్నేశ్‌ అనే యువకుడిపై పులి దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే.. ఇది జరిగిన 18 రోజుల్లోనే జిల్లాలో మరొకరు పులికి బలి కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూడ్రోజుల క్రితం పెంచికల్‌పేట్‌ మండలం అగర్‌గూడ శివారులో పెద్దవాగులో పులి సంచరిస్తుండగా యువకులకు కనిపించింది. అంతకు ముందు బెజ్జూరు, మంచిర్యాల జిల్లా వేమనపల్లి అటవీ ప్రాం తాల్లోనూ ఓ పులి కొందరి కంటపడింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు ఎలా వెళ్లాలని స్థానికులు వణికిపోతున్నారు. దహెగాం అడవుల్లో పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసినా చిక్కడం లేదు. కాగజ్‌నగర్‌ డివిజన్‌లో మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఆరు పులుల వరకు సంచరిస్తున్నాయి. తడోబా అందేరి టైగర్‌ రిజర్వులో పులులు సమీప గ్రామాల్లోకి వచ్చి దాడులు చేసిన ఘటనలు అనేకం.. ఈ క్రమంలో అటువంటి ఘటనలే ఇక్కడా పునరావృతం అవుతుండటంతో అక్కడి జనం భయాందోళన చెందుతున్నారు. 

అంబులెన్స్‌కు అడ్డుగా..   
ఇటు నిర్మల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా బెజ్జూర్‌–పెంచికల్‌పేట్‌ సరిహద్దులోని గొల్లదేవర వద్ద దాదాపు 9 నిమిషాల పాటు పులి అంబులెన్స్‌కు అడ్డొచ్చినట్టు అంబులెన్స్‌ డ్రైవర్‌ గణేశ్‌ ‘సాక్షి’కి తెలిపారు. దీంతో వాహన లైట్లు బంద్‌ చేసి అక్కడే వేచిచూశానన్నారు. బెజ్జూర్‌–సులుగుపల్లి, చిన్నసిద్దాపూర్, పెద్ద సిద్దాపూర్‌ గ్రామాల వైపు అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లినట్లు వెల్లడించాడు. 

దాడిచేసింది కొత్త పులే.. 
దిగిడలో దాడి చేసిన పులి ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. తాజా ఘటనలో దాడి చేసింది మరో పులిగా గుర్తించాం. దీనిని మ్యాన్‌ఈటర్‌ అనలేం.. పత్తి చేన్లు అటవీప్రాంతంలో పులి ఆవాసం వరకు విస్తరించాయి. దీంతో పులి ఆవాసానికి ప్రతికూలంగా మారాయి. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తాం.. పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నాం.
– శాంతారామ్, జిల్లా అటవీ అధికారి 

‘అవ్వా సచ్చిన్నే’ అనే అరుపు విని..
అందరం మధ్యాహ్నం పని ముగించుకుని పత్తి చేనులో అన్నం తినేందుకు వెళ్తుండగా ఒక్కసారిగా ‘అవ్వా సచ్చిన్నే’ అంటూ అరుపు వినబడింది. ఉలిక్కిపడి చూడడంతో పులి యువతిని నోట కరుచుకొనిపోతోంది. వెంటనే ఓ కర్ర తీసుకుని పులిపైకి విసిరాను. అక్కడున్నవాళ్లమంతా అరవడంతో దూరంగా వెళ్లింది. వెళ్లి చూసేసరికి అప్పటికే యువతి మృతి చెందింది. నేను, రాజన్‌ కలిసి ఆమెను తీసుకొస్తుండగా మాపైకి కూడా గాండ్రిస్తూ మీదకు ఉరకబోయింది. అందరం గట్టిగా అరవడంతో అడవిలోకి పారిపోయింది.    
–అన్నం చక్రవర్తి, ప్రత్యక్ష సాక్షి  

మరిన్ని వార్తలు