DCGI Approval: కోవిడ్‌కు సరికొత్త చికిత్స!

28 Apr, 2021 17:40 IST|Sakshi

హెచ్‌సీయూ, సీసీఎంబీ, విన్స్‌ బయో ప్రొడక్ట్‌ సంస్థల సంయుక్త పరిశోధన 

విన్‌కోవ్‌–19 పేరిట రూపొందించిన సంస్థలు.. 

క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి 

సాక్షి, హైదరాబాద్‌: కరోనాకు విరుగుడుగా పనిచేసేందుకు తయారుచేసిన ‘విన్‌కోవ్‌–19’ అనే ఉత్పత్తికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చింది. భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు అనుమతులు జారీచేసింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), విన్స్‌ బయోప్రొడక్ట్‌ లిమిటెడ్‌ సంస్థ సంయుక్తంగా విన్‌కోవ్‌–19ను అభివృద్ధి పరిచారు. విన్‌కోవ్‌–19 కరోనాకు ఒక విధమైన చికిత్సా విధానం అని పరిశోధకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 300 మంది కరోనా సోకిన వారిపై కరోనా మార్గదర్శకాల మేరకు ప్రయోగించి విన్‌కోవ్‌–19 సామర్థ్యాన్ని పరిశీలించనున్నారు. 

నిష్క్రియాత్మకమైన సార్స్‌ సీవోవీ–2 కరోనా వైరస్‌ కొమ్ము ప్రోటీన్లను (గ్లైకో ప్రొటీన్‌) గుర్రాల రక్తంలోకి ఎక్కించడం ద్వారా వాటిలో యాంటీ బాడీలు (యాంటీసెరా) ఉత్పత్తి అయ్యేలా పరిశోధకులు చేశారు. ఆ తర్వాత గుర్రం రక్తంలోని సీరంను తీసి ఈ విన్‌కోవ్‌–19ను తయారు చేశారు. ఈ సీరంను కరోనా సోకిన వారికి ఎక్కిస్తే.. వారిలోని వైరస్‌ను చంపేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా సోకిన తర్వాత వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోకుండా ఉండేందుకు ఈ యాంటీబాడీలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. అందుకే ఈ విన్‌కోవ్‌–19ను కరోనా సోకిన తర్వాత సాధ్యమైనంత తొందరగా ఇస్తే వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. విన్‌కోవ్‌ –19 తయారీకి గతేడాది మే 15న హెచ్‌సీయూ, సీసీఎంబీ, విన్స్‌ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. 

ట్రయల్స్‌ ముగియగానే ఉత్పత్తి.. 
దేశవ్యాప్తంగా క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా ముగిసిన వెంటనే విన్‌కోవ్‌–19ను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు విన్స్‌ బయోప్రోడక్ట్‌ లిమిటెడ్‌ సీఈవో సిద్ధార్థ్‌ డాగా పేర్కొన్నారు. హెచ్‌సీయూ పరిశోధక బృందానికి స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నూరుద్దీన్‌ ఖాన్, సీసీఎంబీలో ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కృష్ణన్‌ హరినివాస్‌ నేతృత్వం వహిస్తున్నారు. విన్స్‌ బయోప్రొడక్ట్‌ సంస్థలో పరిశోధనా బృందానికి డాక్టర్‌ కృష్ణ మోహన్‌ నేతృత్వం వహిస్తున్నారు. కాగా, పరిశోధనా బృందాన్ని హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్‌ పొదిలె అప్పారావు అభినందించారు.

మరిన్ని వార్తలు