అనాథ శవాలతో దందా..ఇక్కడ శవాలు లభించును!

30 Mar, 2021 04:00 IST|Sakshi

అన్‌క్లెయిమ్డ్‌ బాడీలను విక్రయించవచ్చన్న ప్రభుత్వ 231 జీవో 

దీనిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న కొందరు వైద్య సిబ్బంది 

అనుమానాస్పద మృతుల బాడీలను అన్‌క్లెయిమ్డ్‌గా చూపి అమ్ముతున్న వైనం 

రాష్ట్ర సరిహద్దులు దాటిన మెడికల్‌ మాఫియా దందా 

ఢిల్లీ, గోవా, కర్ణాటక, మణిపాల్, పుదుచ్చేరి ఎక్కడికైనా తరలింపు 

చేతులు మారుతోన్న కోట్ల రూపాయలు 

హైదరాబాద్‌: అనాథ శవాల చీకటి వ్యాపారంలో మరెన్నో కోణాలు బయటపడుతున్నాయి. చట్టాలు, నిబంధనల్లోని లొసుగులను వాడుకుంటున్న కొందరు ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేయాల్సిన బాడీలను.. అన్‌క్లెయిమ్డ్‌గా చూపి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఈ వ్యవహారానికి జీవో 231ను అడ్డం పెట్టుకుంటున్నారు. ఈ మెడికల్‌ మాఫియా కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశ నలుమూలలకూ అనాథ శవాల వ్యాపారాన్ని విస్తరించింది. అన్‌క్లెయిమ్డ్, అనుమానాస్పద స్థితిలో మరణించిన వారి బాడీలు, జీవో 231, సీఆర్పీసీ 174ల గురించి తెలుసుకుంటే.. ఈ వ్యవహారంలో మర్మం అర్థమవుతుంది. 

అన్నింటినీ అన్‌క్లెయిమ్డ్‌గా చూపుతూ..! 
ఉమ్మడి రాష్ట్రంలో అనాథ శవాలను ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ ఇచ్చినదే 231 జీవో. అవసరాన్ని బట్టి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు అన్‌క్లెయిమ్డ్‌ డెడ్‌ బాడీస్‌ను మాత్రమే ఇవ్వాలి. ఇందుకు రూ.15,000 ఫీజు, రవాణా చార్జీలు వసూలు చేయాలి. ఇక్కడే కొందరు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల వైద్య సిబ్బంది తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. ఏది అన్‌క్లెయిమ్డ్, ఏది అనుమానాస్పద స్థితిలో మరణించిన వారి మృతదేహం అన్నది పక్కన పెట్టి.. అన్నింటినీ అక్రమంగా అన్‌క్లెయిమ్డ్‌ డెడ్‌ బాడీస్‌ ఖాతాలో వేసేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించకుండా గుట్టుచప్పుడు కాకుండా లక్షల రూపాయలకు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అమ్ముకుంటున్నారు.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దొరికిన శవాల విషయంలో 174 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేస్తున్న పోలీసులు.. తర్వాత వాటికి పోస్టుమార్టం, అంత్యక్రియలు వంటివాటిని పర్యవేక్షించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిని ఆసరాగా తీసుకుంటున్న వైద్య సిబ్బంది అక్రమంగా మెడికల్‌ కాలేజీలకు అమ్ముకుంటున్నారు. 
దేశవ్యాప్తంగా శవాల సరఫరా: 231 జీవోను అడ్డం పెట్టుకుని చేస్తున్న శవాల దందా.. రాష్ట్ర హద్దులు దాటి దేశవ్యాప్తంగా విస్తరించింది. ఒక్క ఉస్మానియా ఆస్పత్రి నుంచే పెద్ద సంఖ్యలో అన్‌క్లెయిమ్డ్‌ డెడ్‌బాడీలను ఢిల్లీ, పుదుచ్చేరి, బెంగళూరు, కొప్పాల్, హుబ్లీ, మణిపూర్, ఏపీ, తమిళనాడులోని పలు మెడికల్‌ కాలేజీలకు విక్రయించారు. వాటి ద్వారా కోటి రూపాయలకుపైగా ఆస్పత్రికి ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కొన్నేళ్ల కింద మణిపాల్‌లోని ఓ మెడికల్‌ కాలేజీ ఏకంగా 15 శవాలను ఆర్డర్‌ చేయడం, ఇక్కడి నుంచి పంపడం గమనార్హం. 

తరలిపోయే వాటిలో అనుమానాస్పద శవాలు కూడా..! 
రాష్ట్రం నుంచి శవాలు సరిహద్దు దాటాలంటే సరైన అనుమతులు ఉండాలి. ఈ విషయంలో కొందరు పోలీసులు కూడా వైద్య సిబ్బందితో చేతులు కలిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉస్మానియా మార్చురీ నుంచి వివిధ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు పెద్ద సంఖ్యలో అన్‌క్లెయిమ్డ్‌ డెడ్‌బాడీలను అమ్మినట్టు రికార్డులు ఉన్నాయి. మరి ఆ డెడ్‌బాడీలన్నీ వివిధ ఆస్పత్రుల్లో చేరి చనిపోయినవారి శవాలా, లేక 174 సీఆర్‌పీసీ వర్తించే అనుమానాస్పద మృతుల శవాలా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

వందలాది మంది అనాథల్లా ఎలా చనిపోయారు? ఆ డెడ్‌ బాడీల కోసం ఎవరూ క్లెయిమ్‌ చేసుకోలే దా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  మెడికల్‌ కా లేజీలకు తరలిన వాటిలో అనుమానాస్పద మృతు ల శరీరాలు కూడా ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు మెడికల్‌ కాలేజీలకు తరలిన డెడ్‌బాడీలు ఎవరివి? వారి ఫొటోలు ఏ పత్రికలో ప్రచురితమయ్యాయి? ఏ వెబ్‌సైట్లో వారి వివరాలు ఉన్నాయి. వారి వేలిముద్రలు, శాంపిల్స్‌ను ఎవరు, ఎక్కడ భద్రపరిచారు. తర్వాత కాలంలో వారి బంధువులు ఎవరైనా వచ్చారా? అన్న ప్రశ్నలకు సమాధానం వైద్య సిబ్బందికే తెలియాలి. 

అన్‌ క్లెయిమ్డ్‌ వేరు.. అనుమానాస్పదం వేరు 
ఎవరైనా అనారోగ్య కారణాలతో.. స్వయంగానో, ఇతరుల సాయంతోనో ఆస్పత్రిలో చేరుతుంటారు. అలాంటివారిలో కొందరు చికిత్స పొందుతుండగానే మరణిస్తారు. ఆ శవాలను తీసుకెళ్లడానికి ఎవరూరారు. మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులే శవాన్ని ఆస్పత్రిలో వదిలేసి వెళ్తుంటారు. ఇలాంటి శవాలను అన్‌క్లెయిమ్డ్‌ డెడ్‌బాడీలు (అనాథ శవాలు) అంటారు. వీటికి పోస్టుమార్టం నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఈ బాడీలను మెడికల్‌ కాలేజీలకు ఇచ్చేందుకు వీలుంటుంది. 
 రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చనిపోయి, వారి వివరాలేమీ తెలియకుంటే అనుమానాస్పద డెడ్‌బాడీలుగా పేర్కొంటారు. దీనికి సంబంధించి సీఆర్‌పీసీ 174 సెక్షన్, పోలీసు మ్యాన్యువల్‌ 490 ప్రకారం.. తప్పకుండా కేసు నమోదు చేయాలి. శవానికి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అంత్యక్రియలు నిర్వహించాలి. పోలీస్‌ మాన్యువల్‌ 311 ప్రకారం.. అనుమానాస్పద స్థితిలో మరణించిన వ్యక్తుల శవాలను గ్రామ పంచాయతీ లేదా పురపాలక సిబ్బంది సాయంతో అంత్యక్రియలు నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు లేదా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అప్పగించకూడదు. 

హైకోర్టును ఆశ్రయిస్తాం 
అనాథ శవాల విషయంగా జరుగుతున్న అక్రమాలపై త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తాం. మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించి ఎలాంటి పబ్లిక్‌ డొమైన్‌ లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు, దందాలు సాగుతున్నాయి. అనాథ శవాలను తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపే సమయంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు తీసి పెట్టడం లేదు. పెద్ద సంఖ్యలో అనాథ శవాలు వివిధ ప్రైవేటు కాలేజీలకు తరలిపోయాయి. అందులో సగానికిపైగా వివిధ రాష్ట్రాలకు పంపారు.

ఇవన్నీ జీవో నం.231 ప్రకారం.. అన్‌క్లెయిమ్డ్‌ డెడ్‌బాడీస్‌ అని చెబుతున్నారు. కానీ అందులో 174 సీఆర్‌పీసీ వర్తించే అనుమానాస్పద డెడ్‌బాడీలు కూడా ఉండే ఉంటాయి. ఏళ్లుగా వేలాది శవాలను ఎవరూ క్లెయిమ్‌ చేసుకోకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. అలా పంపిన శవాల వివరాలను ఎక్కడ పొందుపర్చారో తెలియాలి. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తాం. 
– రాజేశ్వర్‌రావు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌  

మరిన్ని వార్తలు